Pakistan: 2011లో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. మన పెరట్లో పాముల్ని పెంచుకుని, అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించడం అవివేకం అవుతుందని పాకిస్తాన్‌ని ఉద్దేశించి అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిన పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. తాను పెంచి పోషించిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశాన్ని వణికిస్తున్నారు. రెండు రోజుల క్రితం పాకిస్తాన్ వైమానిక దళం ‘‘తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)’’ని టార్గెట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 40కి పైగా ప్రజలు చనిపోయినట్లు తాలిబన్లు తెలిపారు. తప్పకుండా ప్రతీకారం ఉంటుందని పాక్‌ని హెచ్చరించారు.
ఈ దాడి నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్‌ని పాలిస్తున్న తాలిబన్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. 15000 మంది తాలిబన్ ఫైటర్ల పాకిస్తాన్ సరిహద్దు వైపు మార్చ్ చేస్తున్నారు. ఆఫ్ఘన్‌లో అధికారాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత పాక్ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాక్ ఆర్మీ, పోలీసులు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబన్లకే ఇప్పుడు ఆ దేశం బలవుతోంది. గతంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ని చేజిక్కించుకున్న తరుణంలో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వారిని ‘‘వరం’’గా కొనియాడారు.
Read Also: Masood Azhar: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కి గుండెపోటు..!
రెండు రోజుల క్రితం పాక్ ఎయిర్ స్ట్రైక్స్‌పై ఆఫ్ఘాన్ తాలిబన్ పాలకులు ఆగ్రహంగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పాకిస్తాన్ రాయబారిని పిలిపించి దాడులపై తీవ్ర నిరసనను తెలియజేసింది. ప్రతీకారం కోసం దాదాపుగా 15,000 మంది తాలిబన్ యోధులు కాబూల్, కాందహార్, హెరాత్ నుంచి పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుని అనుకుని ఉన్న మీర్ అలీ సరిహద్దు వైపు కవాతు చేస్తున్నట్లు సమచారం.
ఇస్లామాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ నివేదిక ప్రకారం 2022తో పోలిస్తే 2023లో పాకిస్తాన్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల వల్ల 56% మరణాలు పెరిగాయి, 500 మంది భద్రతా సిబ్బందితో సహా 1,500 మంది మరణించారు. తాలిబన్ దాడుల్ని అరికట్టాలని పలు మార్లు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌ని కోరింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 5 లక్షల మంది పత్రాలు లేని ఆఫ్ఘన్ వలసదారుల్ని పాకిస్తాన్ బహిష్కరించడంతో వివాదం మరింత ముదిరింది.