Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రసారం అయింది. దేశంతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యలయంలో కూడా లైవ్ టెలికాస్ట్ జరిగింది. మన్ కీ బాత్ వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలుసుకునే అవకాశం కలిగిందని ప్రధాని అన్నారు. తన ఆలోచనలను పంచుకోగలిగానని వెల్లడించారు. 100వ ఎపిసోడ్ కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని దేశంలోని కోట్ల మంది వినేలా బీజేపీ భారీ ఏర్పాట్లను చేసింది.
Read Also: CM KCR: ‘సింహ లగ్న’ ముహూర్తంలో రాష్ట్ర పరిపాలనా భవనాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
సమాన్యులకు సంబంధించి ప్రతీనెల కొన్ని వేల సందేశాలను ‘మన్ కీ బాత్’లో చదివానని ప్రధాని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింతగా చేరువ చేసిందని అన్నారు. చెట్లు నాటడం, పేదలకు వైద్యం, ప్రకృతి రక్షణకు పాటుపడటం వంటి కార్యక్రమాలు తనలో ప్రేరణ నింపాయని అన్నారు. 2014 విజయదశమి రోజు మన్ కీ బాత్ మొదలు పెట్టామని, ప్రజలతో భాగస్వామ్యం అయ్యామని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చర్చించామని, సమాజంలో ఎన్నో మార్పులకు మన్ కీ బాత్ శ్రీకారం చుట్టిందని అన్నారు. చత్తీస్ గఢ్ లోని స్వయం సహాయక సంఘం గురించి మోదీ ప్రస్తావించారు. మహిళా శక్తిని ప్రశంసించారు.
‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారం హర్యానాలో లింగ నిష్పత్తిని మెరుగుపరిచిందని మన్ కీ బాత్ 100వ ఎడిషన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హర్యానా నుండే ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారాన్ని ప్రారంభించానని గుర్తుచేశారు. ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రచారం నన్ను చాలా ప్రభావితం చేసిందని, ఒకరి జీవితంలో కుమార్తె ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి ఈ ప్రచారం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు.
మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో ప్రజలు వినేలా బీజేపీ చర్యలు తీసుకుంది. పార్టీ జాతీయాధ్యక్షుడి నుంచి బూల్ లెవల్ కార్యకర్తలు వినేలా ఏర్పాట్లను చేసింది. బీజేపీ చీఫ్ జేపీనడ్డా స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని రాష్ట్రాల రాజ్ భవన్లు, బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల నివాసాల్లో వందో ఎపిసోడ్ ను వినిపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న జేపీ నడ్డా, మహారాష్ట్రలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నారు.