Indian Railways: భారతీయ రైళ్లు కొత్త లుక్‌ను సంతరించుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు సేవలందిస్తోన్న ట్రైన్స్ కు కొత్త బోగీలు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 370 రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలను అమర్చాలని చూస్తుంది. ఈ ప్రక్రియ నవంబర్ నెలాఖరు వరకు పూర్తి అవుతుందని రైల్వే బోర్డు తెలిపింది. ఈ బోగీల ద్వారా రోజుకు లక్ష మంది ప్రయాణికులు ప్రయాణించే ఛాన్స్ ఉందన్నారు. పలు రైళ్లకు ఇప్పటికే 583 జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేయగా.. మిగతా రైళ్లకు కోచ్ లను అమర్చే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
Read Also: IPL 2025 Auction: బీసీసీఐ చెత్త నిర్ణయం తీసుకుంది: మైకేల్ వాన్
కాగా, భారతదేశంలోని అన్ని రైల్వే జోన్‌లు, డివిజన్లలో ఈ కోచ్‌లను ఏర్పాటు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. 2025లో హోలీ పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తాము సన్నాహాలు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. రాబోయే రెండేళ్లలో 10,000 నాన్-ఏసీ కోచ్‌లను ప్రవేశ పెట్టాలని చూస్తున్నాం.. దీని ద్వారా 8 లక్షల మంది ప్యాసింజర్లు జర్నీ చేయవచ్చని రైల్వే బోర్డు పేర్కొంది. మా లక్ష్యానికి అనుగుణంగా ఈ కోచ్‌ల తయారీ చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో కొనసాగుతోందన్నారు. ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలతో పాటు భద్రతా ప్రమాణాలతో ఈ 10 వేల నాన్ ఏసీ కోచ్‌లను రూపొందించామని రైల్వే బోర్డు తెలిపింది.