Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధామ్‌తరి జిల్లాలో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బొలెరో ట్రక్కును ఢీకొట్టడంతో 10 మంది అక్కడిక్కడే మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది.
Read Also: SCO Meeting: ఎస్‌సీఓ సమావేశాలకు గోవా సిద్ధం.. హాజరుకానున్న పాకిస్తాన్ మంత్రి
వివరాల్లోకి వెళితే ఒకే కుటుంబానికి చెందిన వారంతా బొలెరోలో సోరం నుంచి మర్కటోలాకు వెళ్తున్నారు. బలోద్ జిల్లాలోని గత్రా సమీపంలో కాంకేర్ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బొలెరో ఢీకొట్టింది. దీంతో 10 మంది అక్కడిక్కడే మరణించారని బలోద్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రమాదానికి కారణం అయిన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితులను మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పురూర్ పోలీస్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.