Site icon NTV Telugu

Bengaluru: ఎడతెరిపిలేని వర్షాలు.. కూలిన భారీ బిల్డింగ్.. ముగ్గురు మృతి

Underconstructionbuildingco

Underconstructionbuildingco

బెంగళూరులో గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంగళవారం అయితే 27 ఏళ్ల రికార్డును చెరిపివేస్తూ భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్థం అయింది. ఇదిలా ఉంటే వర్షాలు కారణంగా నిర్మాణంలో భారీ అంతస్తు బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైంది. మృతుల్లో ఒకరిని బీహార్‌కు చెందిన హనుమంతు (25)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఒక మహిళ సహా తొమ్మిది మందిని రక్షించారు.

భవనం కూలిన తూర్పు బెంగళూరులోని బాబుసాపాళ్య దగ్గరకు రెస్క్యూ టీమ్ చేరుకుంది. శిధిలాలను తొలగించి చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించారు. పలువురు చిక్కుకున్నట్లు వార్తలు విపిస్తున్నాయి. ముమ్మరంగా సహాయ చర్యలు సాగుతున్నాయి.

మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి 186.2 మి.మీ వర్షం పాతం నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది. అక్టోబర్ 1, 1997లో 178.9 మి.మీ వర్షం పాతం నమోదైంది. తిరిగి 27 ఏళ్ల తర్వాత ఆ రికార్డును మంగళవారం తిరగరాసింది. ఈ రోజంతా కూడా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

యలహంకలో తీవ్ర వరదలు..
యలహంకలో కేంద్రీయ విహార్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వారం వ్యవధిలో వరదలకు గురవడం ఇది రెండోసారి. కాంప్లెక్స్‌లోని నివాసితులు మంగళవారం ఉదయం నడుము లోతులో నీరులో మునిగిపోయారు. కార్లు మరియు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. బోట్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

బెంగళూరులో ఎటుచూసినా నీళ్లే ఉన్నాయి. అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. వరద నీటిలో ప్రజాప్రతినిధుల ఇళ్లు కూడా మునిగిపోయాయి.

ఇది కూడా చదవండి: Minister Anitha: ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా అడుగులు.. దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

Exit mobile version