రోడ్డు ప్రమాదం 10 మంది భక్తులను పొట్టనబెట్టుకున్న ఘటన అసోంలో జరిగింది.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అసోంలోని కరీంగంజ్ జిల్లా బైతఖల్ వద్ద భక్తులతో వెళ్తున్న ఆటోను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది మృతిచెందారు. ప్రమాద ధాటికి ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందారని పోలీసులు తెలిపారు.. ఛాట్ పూజ ముగించుకుని తిరిగి సొంత ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని.. మృతుల్లో మహిళలు, యువతులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారని వెల్లడించారు పోలీసులు.. ఇక, ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అసోం సీఎం హిమంత బిశ్వ సర్మ… మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.