NTV Telugu Site icon

NCP: అజిత్ పవార్ ఎన్సీపీలో కలవరం.. శరద్ పవార్‌‌కి టచ్‌లో 10-15 ఎమ్మెల్యేలు..

Ajit Pawar Vs Sharad Pawar

Ajit Pawar Vs Sharad Pawar

NCP: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘోరపరాజయం ఆ కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా ఎన్సీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీటిని అజిత్ పవార్ వర్గం కొట్టిపారేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం కేవలం ఒకే ఎంపీ సీట్లు దక్కించుకుంది. అయితే, శరద్ పవార్ వర్గం ఏకంగా 08 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి.

Read Also: Akhilesh Yadav: ‘‘ఏం తమ్ముడు, నీకు వేరేలా ట్రీట్మెంట్ ఇవ్వాలా..?’’ జర్నలిస్టుకు అఖిలేష్ బెదిరింపు, వీడియో వైరల్..

అజిత్ పవార్ వర్గానికి చెందిన పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నట్లు ఎన్సీపీ(శరద్ పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ అన్నారు. మహారాష్ట్రలో గందరగోళం మధ్య అసంతృప్త నేతలను శాంతింపచేయడానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గం విస్తరణ చేయవచ్చనే సమచారం ఉంది. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం 04 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తే కేవలం 01 స్థానాన్ని గెలుచుకుంది. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చేతిలో 1.5 లక్షల ఓట్లతో ఓడిపోయారు. మరోవైపు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(శివసేన-ఉద్దవ్, ఎన్సీపీ-శరద్ పవార్, కాంగ్రెస్) కూటమి ఏకంగా 48 సీట్లలో 30 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 13 స్థానాలను గెలుచుకుంది.

గతేడాది ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటుతో పార్టీ రెండు ముక్కలైంది. అయితే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెనక ఉండటంతో ఆ పార్టీ గుర్తు ఆయనకే దక్కింది. దీంతో శరద్ పవార్ వేరే ఎన్సీపీ చిన్న వర్గానికి నాయకుడిగా మిగిలారు. పార్టీలో చీలిక అనంతరం అజిత్ పవార్ ఎన్డీయే కూటమితో చేరారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఒక్క ఎన్సీపీలోనే కాదు, బీజేపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. బీజేపీ కేవలం 09 ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో, ఈ ఫలితాలపై ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వ పదవిని వీడాలనుకుంటున్నారు.