Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!

Zee

Zee

తెలుగు ప్రేక్షకులకు అసలైన బ్లాక్‌బస్టర్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ (ZEE5) సిద్ధమైంది. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు, ఎంగేజ్ చేసే వెబ్ సిరీస్‌లు, నెటివిటీతో కూడిన ఒరిజినల్ కంటెంట్‌తో మునుపెన్నడూ లేని స్థాయిలో అద్భుతమైన లైనప్‌ను అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, షైన్ స్క్రీన్స్ వంటి బ్యానర్లతో జీ5 వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ లైనప్‌లో ప్రేక్షకులను ఉర్రూతలూగించే క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ నటిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘ఎన్‌బీకే 111’. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌గా వస్తున్న ‘జనవరి 12 విడుదల’. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ‘వృషకర్మ’.‘లెనిన్’, ప్రదీప్ మద్దాలి తెరకెక్కిస్తున్న అల్లరి నరేష్ చిత్రం **‘కనక దుర్గ’లతో పాటు ‘డిమాంటీ కాలనీ 2’, ‘జననాయకుడు’, ‘వీరప్పన్ 2’, ‘హాయ్’, ‘ఏ క్వీన్’ లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా జీ5లో కొన్ని సందడి చేస్తున్నాయి, కొన్ని చేయనున్నాయి.

సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల విభాగంలోనూ జీ5 సత్తా చాటుతోంది. నివేదా థామస్ లీడ్ రోల్‌లో వస్తున్న ‘శ్రీమతి’, శివాజీ రాజా, భరత్ నివాస్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘పంచనామా’ సిరీస్‌లు ఆకట్టుకోనున్నాయి. అలాగే సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా పాపులర్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’తో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారు. మరో అడుగు ముందుకేసి ఏఐ (AI) ఆధారిత స్టోరీటెల్లింగ్‌తో ‘విక్రమ్ బేతాళ్’, ‘గరుడ’, ‘చంద్రకాంత’, ‘రామ్ ఆంజనేయ యుద్ధ్’, ‘తిరుపతి బాలాజీ’ వంటి ఫాంటసీ, పౌరాణిక కథలను అందించబోతోంది. వీటితో పాటు కిడ్స్ కోసం ప్రత్యేక షోలు, స్పోర్ట్స్ లవర్స్ కోసం ఫుట్‌బాల్ (ఫిఫా, బుండెస్లీగా), క్రికెట్ (ఐఎల్‌టీ20) లైవ్ ఈవెంట్స్‌ను సైతం స్ట్రీమింగ్ చేయనుంది. దక్షిణాది ప్రేక్షకుల అభిరుచుల గురించి జీ5 (తెలుగు, తమిళ్, మలయాళం) బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ.. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ కొత్తదనాన్ని, తమ మనసుకు హత్తుకునే సహజమైన కథలను ఆదరిస్తారని తెలిపారు. అగ్రశ్రేణి క్రియేటర్స్, నిర్మాణ సంస్థలతో ఉన్న భాగస్వామ్యంతో ప్రేక్షకుల పల్స్ పట్టుకున్నామని, ఈ సరికొత్త లైనప్ ద్వారా అద్భుతమైన, ధైర్యవంతమైన కంటెంట్‌ను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.