బాలీవుడ్ గాయకుడు యో యో హనీ సింగ్ కు కోర్టు అక్షింతలు వేసింది. కొన్ని రోజుల క్రితం ఆయన భార్య షాలిని హనీ సింగ్‌పై ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో ‘గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005’ కింద కేసు దాఖలు చేసింది. అది తాజగా విచారణకు రాగా హనీ సింగ్ కోర్టులో హాజరు కాలేదు. హనీ సింగ్ హాజరు కాకపోవడానికి గల కారణాన్ని పేర్కొంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టు నుంచి మినహాయింపు కోరారు. హనీ సింగ్ ఆరోగ్యం బాగోలేదని, తదుపరి విచారణకు తప్పకుండా హాజరవుతానని ఢిల్లీ కోర్టుకు తెలిపారు.
అయితే హనీ సింగ్ కోర్టుకు హాజరు కానందుకు కోర్టు మందలించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తానియా సింగ్ మాట్లాడుతూ “ఎవరూ చట్టానికి అతీతులు కారు. ఈ విషయాన్ని ఇంత తేలికగా తీసుకోవడం నిజంగా షాకింగ్. హనీ సింగ్ విచారణకు హాజరుకాలేదు. మీరు ఆయన ఆదాయ అఫిడవిట్ దాఖలు చేయలేదు. పైగా వాదనలకు సిద్ధంగా లేరు” అంటూ హనీ సింగ్ తరపు న్యాయవాదిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హనీ సింగ్‌కు కోర్టుకు హాజరు కావడానికి చివరి అవకాశం ఇచ్చారు. మరోసారి ఈ పరిస్థితిని పునరావృతం చేయొద్దని ఆదేశించారు.
Read Also : చిరిగిన బట్టలతో నటి… ముంబై పోలీసులే కారణమట!
షాలిని తన భర్త హనీ సింగ్‌పై ఆగస్టు 3న టిస్ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తానియా సింగ్ ముందు కేసు దాఖలు చేసింది. కేసు నమోదు తరువాత హనీ సింగ్‌కు నోటీసు జారీచేశారు. ఇందులో ఆగస్టు 28 లోపు ఆయన తన జవాబును దాఖలు చేయాలని ఆదేశించారు. దీనితో పాటు కోర్టు హనీ సింగ్‌కు ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీనిలో హనీ సింగ్ అతని భార్య ఆస్తికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని చెప్పారు.
హనీ సింగ్ భార్య షాలిని అతనిపై అనేక ఆరోపణలు చేసింది. గత 10 సంవత్సరాలుగా తనను ఇంట్లో దారుణంగా ఉంచారని ఆయన చెప్పారు. తనను శారీరకంగా, మాటలతో, మానసికంగా హింసించారని, తన వివాహానికి ప్రాముఖ్యత ఇవ్వలేదని, వివాహ ఉంగరాన్ని కూడా ధరించలేదని షాలిని చెప్పింది. హనీ సింగ్, షాలిని 2011 జనవరి 23న వివాహం చేసుకున్నారు. హనీ సింగ్, షాలిని లవ్ స్టోరీ స్కూలు రోజుల్లోనే మొదలైంది.