యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కు సైతం ఈ మధ్య పరాజయాలు తప్పలేదు. వరుస ఫ్లాప్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో ‘విక్రమ్’ సినిమా వచ్చి, కమల్ ను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. అందులో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, చివరిలో మెరుపులా సూర్య ఉంటే ఉండి ఉండొచ్చు, కానీ హీరో కమల్ కాబట్టి ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం ఈ సీనియర్ స్టార్ కే దక్కింది. ఈ సినిమా రిలీజ్ అయిన జూన్ 3వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. అది కమల్ హాసన్ ‘సాగర సంగమం’ విడుదలైన తేదీ. 1983 జూన్ 3వ తేదీ విడుదలైన ‘సాగర సంగమం’ కమల్ హాసన్ కెరీర్ లో మైలురాయి లాంటిది. తాజా వచ్చిన ‘విక్రమ్’ కూడా కలెక్షన్ల పరంగా కమల్ కు బిగ్ బూస్టప్ ఇచ్చింది.
ఇక ప్రస్తుతానికి వస్తే… ఈ నెల 25వ తేదీ క్రేజీ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ రిలీజ్ కాబోతోంది. అతను నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. రకరకాల కారణాల వల్ల ‘బాయ్ కాట్ లైగర్’ అంటూ సోషల్ మీడియాలో కొందరు రచ్చ చేస్తుంటే… మీడియా సమావేశంలో దానికి దీటుగా విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ వస్తున్నాడు. చిత్రం ఏమంటే సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఆగస్ట్ 25న విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ విడుదలై, ఘన విజయం సాధించింది. ఆ సినిమాతో విజయ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పాకిపోయింది. హిందీలో దీన్ని షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’ పేరుతోనూ, తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ ‘ఆదిత్యవర్మ’ పేరుతోనూ రీమేక్ చేశారు. ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలతో విజయ్ దేవరకొండ గ్రాఫ్ కాస్తంత డౌన్ అయ్యింది. మరి ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ డేట్ నే వస్తున్న ‘లైగర్’తో మళ్ళీ తన స్థానాన్ని దక్కించుకుంటాడేమో చూడాలి.
ఇదే మాదిరిగా తమ సినిమాలు విడుదలైన తేదీలలోనే లేటెస్ట్ మూవీస్ ను రిలీజ్ చేయబోతున్న మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అందులో ఒకరు నాగార్జున. ఆయన నటించిన ‘శివ’ విడుదలైన అక్టోబర్ 5వ తేదీనే తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ రిలీజ్ కాబోతోంది. మహేశ్ బాబు తన ‘పోకిరి’ విడుదలైన ఏప్రిల్ 28వ తేదీనే త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న త్రివిక్రమ్ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి అచ్చివచ్చిన తేదీల సెంటిమెంట్ ను ఈ హీరోలు బాగానే ఫాలో అవుతున్నారు!