Yatra 2:దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో విడుదల అయి మంచి విజయం సాధించింది. మహి వి రాఘవ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి ఎంతో అద్భుతంగా నటించారు.ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా యాత్ర2 రాబోతున్న విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు 2019 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్ర అలాగే ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన కథాంశంతో యాత్ర 2 మూవీ రూపొందుతోంది. జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుసగా టీజర్, సాంగ్స్ ను రిలీజ్ చేసి హైప్ పెంచుతున్నారు. జీవా.. జగన్ పాత్రలో నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పొచ్చు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఫిబ్రవరి 3 న ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా దాంతో పాటు ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి , వైయస్ జగన్మోహన్ రెడ్డి పక్క పక్కన నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. యాత్ర 2 చిత్రంలో వైఎస్ భారతిగా కేతకి నారాయణ్ మరియు సోనియా గాంధీ పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెట్ నటిస్తుండగా.. చంద్రబాబు పాత్రలో మహేశ్ మంజ్రేకర్ నటిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏపీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.