‘కె.జి.ఎఫ్’ సీరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ యశ్. దీంతో యవ్ నటించిన కన్నడ చిత్రాలను ఇతర భాషల్లో అనువదించి విడుదల చేస్తున్నారు. అలా వస్తున్న చిత్రమే ‘లక్కీస్టార్’. 2012లో కన్నడలో ‘లక్కీ’ పేరుతో విడుదలైన యశ్ సినిమాను ఆ చిత్ర నిర్మాత రాధికా కుమారస్వామి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ అందిస్తున్న ఈ సినిమాకు డా.సూరి దర్శకత్వం వహించాడు. యష్ సరసన రమ్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అర్జున్ జన్యా సంగీతం అందించారు. లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయింది. ఈ సందర్భంగా ‘లక్కీ స్టార్’ ట్రైలర్ విడుదల చేశారు.
దీనిని తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ రిలీజ్ చేసి తెలుగులోనూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రవిరాజ్, సాహిత్యం అందించిన గురు చరణ్, సంభాషణల రచయిత సూర్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేశవ్ గౌడ్ పాల్గొన్నారు. నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ ‘తెలుగులోనూ స్ట్రెయిట్ గా సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అందుకే ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చినా మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. తెలుగులో మాకు మంచి శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. యష్ నటన, రమ్య గ్లామర్, అర్జున్ జన్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు’ అని చెబుతున్నారు.