జనం కళ్ళింతలు చేసుకొని అమితాసక్తితో ఎదురుచూస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రన్నింగ్ లో ఉన్న అన్ని థియేటర్లలోనూ ‘ఆర్.ఆర్.ఆర్.’ విడుదలవుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాకు గుండెకాయలాంటి ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రతి ఊరిలో అన్ని సినిమా హాళ్ళలోనూ ‘ట్రిపుల్ ఆర్’ సందడి చేయబోతోంది. తెలుగునాట చాలా రోజులకు విడుదలవుతోన్న అసలు సిసలు మల్టీస్టారర్ గా ‘ట్రిపుల్ ఆర్’ జేజేలు అందుకుంటోంది. అందువల్ల ఆ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే గుంటూరు జిల్లాలోని ఒకే ఒక్క థియేటర్ లో మాత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’ ప్రదర్శన సాగడం లేదు. మరి ఆ థియేటర్ ఏది? ఎందువల్ల?
తెలుగు సినిమాలకు మొదటి నుంచీ గుంటూరు జిల్లా కంచుకోట లాంటిది. రాజమౌళి ఇంతకు ముందు తెరకెక్కించిన ‘బాహుబలి’ రెండు భాగాలు గుంటూరు కేంద్రంలోనే వంద రోజులు చూశాయి. అలాంటి గుంటూరు జిల్లాలో బి క్లాస్ సెంటర్ గా పేరొందిన చిలకలూరి పేటలో కొత్త సినిమాలకు విశేషమైన క్రేజ్ ఉంటుంది. ఆ ఊరిలోని రామకృష్ణ థియేటర్ లో మాత్రం ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కావడం లేదు. ఎందుకంటే ఆ థియేటర్ లో గత సంవత్సరం డిసెంబర్ 2 న విడుదలైన ‘అఖండ’ ఇప్పటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. తాజా సూపర్ డూపర్ హిట్స్ లో మొదటి స్థానం ఆక్రమించిన ‘అఖండ’ చిలకలూరి పేటలో వంద రోజులు పూర్తి చేసుకొని, ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ కేంద్రంలో ‘అఖండ’ అనూహ్యమైన వసూళ్ళు చూసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చిలకలూరి పేట – రామకృష్ణ థియేటర్ వారు రోజూ 4 ఆటలతో 25 వారాలు అంటే 175 రోజులు ఆడే దిశగా పరుగులు తీయిస్తున్నారు. అందువల్ల చిలకలూరి పేట లాంటి క్రేజీ సెంటర్ లో ‘ట్రిపుల్ ఆర్’ ఆ ఒక్క థియేటర్ లో ప్రదర్శనకు నోచుకోలేదు. అదన్నమాట అసలు సంగతి!