అడవిశేష్ ‘మేజర్’ సినిమా చూసిన వారికి అందులో శేష్ తో పాటు అందరికీ బాగా గుర్తుండిపోయే పాత్ర సాయిమంజ్రేకర్ పోషించిన ఇషా పాత్ర. శేష్ క్లాస్ మేట్ గా, లవర్ గా, వైఫ్ గా అన్ని షేడ్స్ లో సాయీ మంజ్రేకర్ ఆడియన్స్ మది దోచిందనే చెప్పాలి. నిజానికి సాయి నటించిన తొలి తెలుగు సినిమా ‘గని’ ఏమాత్రం ఆటక్టుకోలేక పోయింది. అది దర్శకుడి వైఫల్యం కావచ్చు. పాత్రలో సరైన గ్రిప్ లేకపోయి ఉండవచ్చు. కానీ ‘మేజర్’ బయోపిక్ మాత్రం తెలుగు తెరకు ఓ అద్భుతమైన, అందమైన నటిని ఇచ్చిందనే చెప్పాలి. ‘మేజర్’ చూసిన చాలా మంది సాయి మంజ్రేకర్ ‘గని’లో నటించిందనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఎవరో కొత్త అమ్మాయి బాగా చేసింది.. చాలా బాగుంది అనేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్, పాటలు చూసిన చాలా మంది ఇప్పటికే సాయి మంజ్రేకర్ ని ఆఫర్లతో ముంచెత్తుతున్నారు కూడా.
అయితే సాయి తను నటించాలంటే ముందుగా కథను సల్మాన్ ఖాన్‌కు చెప్పమని అంటున్నట్లు వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలేమిటన్నది పక్కన పెడితే సాయి మంజ్రేకర్ ప్రముఖ నటుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె. మహేశ్ మంజ్రేకర్ తెలుగులో గోపీచంద్ ‘ఒక్కడున్నాడు’తో పాటు మరి కొన్ని సినమాల్లో నటించాడు. మహేష్ సల్మాన్‌కు సన్నిహితుడు కావడంతో సాయి తన కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను సల్మాన్ కి వదిలేసిందని అంటున్నారు. అసలు ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సల్మాన్ ‘దబాంగ్3’తోనే. ఏది ఏమైనా సాయి ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేయవలసి ఉంది. ‘మేజర్’ సక్సెస్ ను మరింత ముందుకు తీసుకు వెళ్ళేలా తదుపరి ప్రాజెక్ట్ లను కమిట్ అయిన పక్షంలో టాలీవుడ్ లో అమ్మడికి తిరుగుండదు. అలా కాకుండా ‘గని’లాంటి ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటే ఎదుగుబొదుగు లేని హీరోయిన్ల జాబితాలో చేరిపోవటం ఖాయం. చూద్దాం సాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో!?