అమెరికా సచిత్ర వార పత్రిక ‘వరైటీ’ పుణ్యమా అని ఇప్పుడు మన దేశంలో ‘ఆస్కార్ అవార్డుల’ గురించి సినీ ఫ్యాన్స్ లో భలేగా చర్చ సాగుతోంది. ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగంలో అర్హులు అని కొందరు నటులను పేర్కొంటూ, అందులో మన జూనియర్ యన్టీఆర్ పేరునూ ‘వరైటీ’ మేగజైన్ పేర్కొంది. అందువల్లే మనదేశంలో ఇంత హడావుడి మొదలయిందని చెప్పవచ్చు. ఉత్తరాది వారు ముఖ్యంగా బాలీవుడ్ లో కొందరు ‘ట్రిపుల్ ఆర్’ విడుదలైనప్పుడే సినిమాను విమర్శించినా, ఎందుకనో జూనియర్ యన్టీఆర్ అభినయాన్ని ప్రశంసించారు. ఇప్పుడు బాలీవుడ్ వారే జూనియర్ యన్టీఆర్ నటనకు తప్పకుండా అవార్డులు రావల్సిందే అంటున్నారు. అయితే తెలుగునేలపై మాత్రం కొందరు పెదవి విరుస్తున్నారు. ఆస్కార్ అవార్డు రావడమంటే అంత ఆషామాషీగా ఉందా అనీ ప్రశ్నిస్తున్నారు. దానికి ఎన్నో నియమనిబంధనలు ఉంటాయనీ అంటున్నారు. 1999లో ఇటలీ నటుడు రాబర్టో బెనిగ్నీ ఉత్తమ నటునిగా తన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ద్వారా ఆస్కార్ అవార్డు అందుకొని చరిత్ర సృష్టించారు. ఓ విదేశీ చిత్రం ద్వారా విదేశీ నటుడు ఉత్తమ నటునిగా ఆస్కార్ సంపాదించడం అన్నది అదే మొదటిసారి! ఆ తరువాత, అంతకు ముందు కొందరు విదేశీ నటులు ఆస్కార్ అందుకున్నప్పటికీ వారికి ఆ పురస్కారం సంపాదించి పెట్టినవి ఆంగ్ల చిత్రాలు కావడం గమనార్హం!
మళ్ళీ ఇన్నాళ్ళకు కొందరు విదేశీ నటులు ఆస్కార్ బరిలో ఉత్తమ నటుడు విభాగంలో నామినేషన్ సంపాదించే అవకాశం ఉందని ‘వరైటీ’ పత్రిక పేర్కొంది. అందులో మన జూ.యన్టీఆర్ ‘ట్రిపుల్ ఆర్’ సినిమాలోని నటనకు గాను ఆస్కార్ నామినేషన్ పొందే ఆస్కారం ఉందనీ తెలిపారు. మరీ ఇప్పటి నుంచే ఆస్కార్ అవార్డుల హంగామా ఏమిటనీ విసుక్కొనే వారున్నారు. కానీ, 2022 లో విడుదలైన చిత్రాలు జనరల్ ఎంట్రీ కేటగిరీస్ లో నామినేషన్ కోసం అప్లై చేయడానికి నవంబర్ 15, మంగళవారం ఆఖరు తేదీ అని ఇప్పటికే అకాడమీ ప్రకటించింది. అంటే సరిగా మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. కాబట్టి, ‘ట్రిపుల్ ఆర్’ చిత్రానికి మన దేశం నుండి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీగా వెళ్ళాలంటే ఈ ప్రచారం తప్పనిసరి అంటున్నారు విశ్లేషకులు. ఈ లోగా కేంద్రం ఆస్కార్ ఎంట్రీని ఎంపిక చేసే జ్యూరీని నియమించాలి. ఆ జ్యూరీ ఇండియా నుండి అధికారికంగా ‘ట్రిపుల్ ఆర్’నే బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ ఎంట్రీ ఎంపిక చేస్తుందో లేదో అన్న అనుమానాలూ ఉన్నాయి. కాబట్టి, ఇప్పటి నుంచే ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు కదా!
ఇక ఆస్కార్ లో ఎంట్రీ సంపాదించడమే ఓ యజ్ఞం లాంటిదయితే, ఆ తరువాత నామినేషన్ అందుకోవడం మరో బృహత్తర కార్యమే! ఒకవేళ ‘ట్రిపుల్ ఆర్’ చిత్రానికి బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీలో నామినేషన్ లభించినా, లభించక పోయినా ఆ సినిమా ద్వారా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నామినేషన్ పొందే అవకాశం ఉంది. ఎలాగంటే అకాడమీ నియమనిబంధనల ప్రకారం ఈ యేడాది లాస్ ఏంజెల్స్ లో ఒక వారం ప్రదర్శితమైన చిత్రాలు, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కలిగి ఉంటే చాలు. వాటి ద్వారా పలు కేటగిరీల్లో నామినేషన్స్ కోసం ప్రయత్నించవచ్చు.
ఒకవేళ నామినేషన్ వస్తే, ఆ తరువాత ఉంది అసలు కథ. మన దేశం నుండి ఇప్పటి దాకా అధికారికంగా ఎంట్రీ సంపాదించిన “మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్” చిత్రాలు నామినేషన్స్ తోనే సంతృప్తి చెందవలసి వచ్చింది. ఎందుకంటే నామినేషన్ పొందిన తరువాత ఆస్కార్ అవార్డుల ఎంపిక చేసే విధానానికి అనువుగా మనం నామినేషన్ సంపాదించిన కేటగిరీల్లో ఓట్లు పోయేగడానికి తగిన కృషి చేయాలి.
అకాడమీలో దాదాపు పదివేల మంది సభ్యులుంటారు. వీరిలో కనీసం 9,500 మంది ఓటు హక్కు కలిగి ఉంటారు. అసలు ఆస్కార్ సభ్యత్వం ఎలా లభిస్తుంది? గతంలో ఆస్కార్ నామినేషన్ పొందినవారు, ఆస్కార్ విజేతలు అందరూ సభ్యత్వం పొందినవారవుతారు. వీరిని 17 బ్రాంచెస్ గా విభజిస్తారు. ఒక్కో బ్రాంచ్ కు 550 మంది సభ్యులు ఓటు వేసే హక్కు లభిస్తుంది. అయితే నటన విభాగంలో మాత్రం 1300 మంది ఓటర్లు ఉంటారు. వీరు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయనటి అవార్డులను ఎన్నుకుంటారు.
మన సినిమాకు ఒకవేళ బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో నామినేషన్స్ లభించాయని అనుకుందాం. అప్పుడు ఏ కేటగిరీలో ఏ ఓటర్లు ఉన్నారో ముందుగా గమనించాలి. తరువాత వారికి మన సినిమాను ప్రదర్శించి, అత్యధిక శాతం ఓట్లు సంపాదించగలిగితేనే మనవాళ్ళు విజేతలుగా నిలుస్తారు. ఒకప్పుడు ఈ ప్రాసెస్ అంతా చాలా కఠినంగా ఉండేది. కానీ, ప్రపంచీకరణ నేపథ్యంలోనూ, ప్యాండమిక్ అనంతరం ఇటీవల కొన్ని నియమాలను సరళీకృతం చేశారు. ఈ నియమనిబంధనలన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. వాటిని అనుసరించి, నామినేషన్స్ పొందినవారు ఆస్కార్ బరిలో విజేతలుగా నిలవడానికి కృషి చేయవచ్చు.
ఈ సారి డిసెంబర్ 12 నుండి 15 వరకు ప్రిలిమనరీ ఓటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 21న ఆస్కార్ షార్ట్ లిస్ట్స్ ప్రకటిస్తారు. 2023 జనవరి 12 నుండి నామినేషన్స్ ఓటింగ్ మొదలవుతుంది. ఈ ఓటింగ్ జనవర 17న ముగుస్తుంది. 2023 జనవరి 24న నామినేషన్స్ ను ప్రకటిస్తారు. 2023 ఫిబ్రవరి 13న ఆస్కార్ నామినీస్ లంచ్ ఉంటుంది. ఇందులో నామినీస్ పాల్గొని ఫోటోలకు ఫోజులివ్వడం, పరిచయాలు చేసుకోవడం వంటివి సాగుతాయి. 2023 మార్చి 2 నుండి 7 వరకు ఫైనల్ ఓటింగ్ సాగుతుంది. ఇదే కీలక ఘట్టం. 2023 మార్చి 12న జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలెవరో తేలుతుంది.
ఇంత తతంగం సాగుతుంది. కాబట్టే ఎంతో హడావుడి అవసరం. కాబట్టి మనవాళ్ళు ‘ట్రిపుల్ ఆర్’ కోసం చేస్తున్న హంగామాలో తప్పేమీ లేదు. తప్పని భావించేవారు రేపు ఈ సినిమా ద్వారా మన వాళ్ళకు నామినేషన్స్ లభిస్తే అభినందించక తప్పదు.