అలనాటి బాలీవుడ్ సంగీత దర్శకుల్లో ఒకరు ఖయ్యామ్. ఆయన భార్య జగ్జీత్ కౌర్ ఆదివారం మరణించారు. మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల ఆమె 93 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. జగ్జీత్ కౌర్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నేపథ్య గాయనిగా ప్రతిభను చాటుకున్నారు. కేవలం 21 చిత్రాల్లో మాత్రమే ఆమె గానం వినిపించినా ఆణిముత్యాల్లాంటి పాటల్ని జగ్జీత్ కౌర్ ఆలపించారు.
హిందీ సినిమా రంగంలో సంగీత దర్శకుడిగా ఎంతో పేరున్న ఖయ్యామ్ రెండేళ్ల క్రితమే గుండెపోటుతో మరణించారు. ఆయన కుమారుడు ప్రదీప్ కూడా కార్డియాక్ అరెస్ట్ కారణంగా 2012లో అకాల మరణం పాలయ్యాడు. దాంతో కొన్ని రోజులుగా ఖయ్యామ్ భార్య జగ్జీత్ కౌర్ ఒంటరిగా ఉంటున్నారు. తీవ్రమైన డిప్రెషన్ కి లోనైన ఆమె జీవితం మీద ఆసక్తి కోల్పోయారని ఖయ్యామ్ మాజీ మ్యానేజర్ రాజ్ శర్మ వివరించారు. ఆయనే జగ్జీత్ కౌర్ అంత్యక్రియలు నిర్వహించారు. ఖయ్యామ్, జగ్జీత్ కు సంబంధించిన అవార్డ్స్, ఆస్తులు వంటివన్నీ ఇకపై ట్రస్ట్ నియంత్రణలో ఉంటాయని కూడా శర్మ చెప్పారు.
జగ్జీత్ కౌర్ అంత్యక్రియల్లో ప్రముఖ గాయకుడు అనూప్ జలోట, సంగీత దర్శకుడు ఉత్తమ్ సింగ్, స్థానికులు పాల్గొన్నారు.