పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ ఇటు సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. 2024లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో కమిట్ అయిన సినిమాలను చకాచకా పూర్తి చేసి ఆ తర్వాత 2023లో పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెడతాడని వినిపించింది. ఇదిలా ఉంటే పవన్ కమిట్ మెంట్స్ లో హఠాత్తుగా మరో సినిమా యాడ్ అయింది. ఆల్ రెడీ పూజ కూడా జరుపుకుందని సమాచారం. దీనికి నటుడు, దర్శకుడు సముతిర ఖని దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది తమిళంలో సముతిర ఖని దర్శకత్వంలో రూపొంది ఓటీటీలో విడుదలై అందరి మన్ననలు పొందిన ‘వినోదాయ సీతం’కు రీమేక్.
అసలు ఇందులో పవన్ ని ఆకట్టుకున్న అంశం ఏమిటి? ఎందుకు బిజీ షెడ్యూల్ లో కూడా ఈ సినిమాను కమిట్ అయ్యాడన్నది చూద్దాం. ఇది ఓ ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రం. తమిళంలో తంబిరామయ్య, సముతిరఖని ముఖ్యపాత్రలు పోషించారు. జనరల్ మేనేజర్ గా రిటైర్ అవ్వాలని కోరుకునే పరుశురామ్ కి భార్య, ముగ్గురు పిల్లలు. ఇంట్లో ప్రతిది తన ఇష్టప్రకారం జరగాలనుకునే పరుశురామ్ హఠాత్తుగా ఓ యాక్సిడెంట్ కి గురై చనిపోతాడు. అతను లేచే టైమ్ కి దేవదూత వచ్చి భూమి మీద తనకి నూకలు చెల్లిపోయాయని చెప్పి తనను టైమ్ గా పరిచయం చేసుకుంటాడు. దాంతో పరుశురామ్ టైమ్ ని బ్రతిమిలాడుకుని తను చేసిన కొన్ని తప్పులు దిద్దుకునే అవకాశం ఇవ్వమంటాడు. దానికి టైమ్ అంగీకరించి మూడు నెలల గడువు ఇస్తూ తను కూడా పరుశురామ్ తోనే ఉంటానని కండిషన్ పెడతాడు. ఇంటికి వచ్చి మూడు నెలల్లో పరుశురామ్ తన తప్పుల్ని దిద్దుకున్నాడా? పరుశురామ్ చనిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో, ఆపీస్ లో ఏం జరిగింది వంటి విషయాలను హిలేరియస్ గా తీశాడు సముతిర ఖని. ఇందులో పరుశురామ్ గా తంబిరామయ్య, దేవదూత కమ్ టైమ్ గా సముతిర ఖని నటించారు.
తెలుగులో దేవదూత పాత్రనే పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. పరశురామ్ పాత్రను మార్చి సాయిధరమ్ తేజ్ తో చేయిస్తున్నారు. తనకో లవర్ ని పెట్టి తెలుగు నేటివిటికి అనుగుణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. గతంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ విషయంలోనూ ఇదే జరిగింది. మలయాళ హిట్ ని ‘భీమ్లా నాయక్’ పేరుతో తెలుగుకు అనుగుణంగా మార్పులు చేసి సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకక్కించారు. తెలుగులో సోసో అనిపించుకుంది. ఇప్పుడు ‘వినోదాయ సీతం’ వంతు. దర్శకుడుగా రైటర్ గా తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న నటుడు సముతిర ఖని. ఆయన త్రివిక్రమ్ చేస్తున్న మార్పులకు ఎంత వరకూ అంగీకరిస్తారు. ఈ మార్పులతో ఒరిజినల్ లో ఉన్న డెప్త్ అలాగే ఉంటుందా!? అన్నది పక్కన పెడితే… పవన్ ఈ సినిమా చేయటానికి అంగీకరించిందే త్రివిక్రమ్ వల్ల. సో ఆ విషయంలో కాంప్రమైజ్ కాక తప్పదు. అయితే ఒరిజినల్ స్క్రిప్ట్ ను అలాగే ఉంచి ఆ పాత్రను వెంకటేశ్ తో నటింప చేస్తే ఇంక బాగా ఉంటుందన్నది పరిశీలకుల మాట. గతంలో వెంకటేశ్, పవన్ కలసి ‘గోపాల గోపాల’లో నటించి ఉండటం వల్ల ఆ సినిమా ప్రభావం దీనిమీద పడుతుందని భావించారో ఏమో అందుకే మార్పులు చేస్తున్నట్లున్నారు. వీలయినంత ఫాస్ట్ గా సినిమా పూర్తి చేసి వెంటనే విడుదల చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. మరి ఒరిజినల్ కి ఎలాంటి మార్పులు చేస్తారు? చేసిన మార్పులను తెలుగు ప్రజలు ఎంత వరకూ ఓన్ చేసుకుంటారన్నది చూద్దాం.