Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. మార్చి 8 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. క్రౌడ్ ఫండింగ్ తో దాదాపు 9 ఏళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డారు చిత్ర బృందం. ఇక సినిమా బావుంది అని మౌత్ టాక్ అయితే వచ్చింది కానీ, అంతగా సినిమాపై బజ్ రావడం లేదు. అయితే వేరే భాష నుంచి వచ్చిన సినిమాలకు సెలబ్రిటీలు ఆహా, ఓహో అని ట్వీట్స్ చేస్తున్నారు కానీ, మన తెలుగు సినిమా గురించి ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. దీంతో విశ్వక్ సేన్ .. తన ఆవేదనను మీడియా ముందు బయటపెట్టాడు. మా సినిమా గురించి కూడా నలుగురు పెద్ద మనుషులు మాట్లాడండయ్యా.. అంటూ అడిగేశాడు.
తాజా ప్రెస్ మీట్ లో విశ్వక్ మాట్లాడుతూ.. “అందరం కలిసి ఈజీగా ఒక కమర్షియల్ సినిమా తీయొచ్చు. కానీ, 6 ఏళ్లు కష్టపడి ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని ఒక కొత్త సినిమా రావాలి తెలుగు సినిమాకు అని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు.. కానీ, వెనక్కి లాగకండి. నాకు తెలియదు ఎవరు చేస్తున్నారో.. అది కూడా నేను పట్టించుకో దలచుకోలేదు.. ఎందుకంటే నాకు అంత టైమ్ కూడా లేదు. ఇకముందు నుంచి మంచి కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించే కథలతో వస్తాను. చూడని వాళ్ళుంటే చుడండి.. మా సినిమాకి కూడా ఒక నలుగురు పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి చూసి మాట్లాడితే బాగుంటది, ఇది మన తెలుగు సినిమా. ఇలాంటి సినిమా ఇంతకుముందు తెలుగులో రాలేదు అని నేను గర్వంగా చెప్తాను. గామి ఇక్కడితో ఆగిపోదు.. ఇప్పుడే గామి మొదలయ్యింది. పదేళ్లు, ఇరవై ఏళ్ళు తరువాత అయినా కూడా తెలుగులో ఇలాంటి సినిమా ఒకటి ఉందని గర్వంగా చెప్పుకుంటారు. నేను ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడడం లేదు.. సినిమా రిలీజ్ అయిన నాలుగురోజుల తరువాత మాట్లాడుతున్న మాటలు ఇవి. సినిమా అర్ధం కాలేదు అన్నవారిని తెలివి తక్కువ వారు అనలేం కానీ, ఇంకోసారి చూడండి.. అర్ధమవుతుంది. ఇదే డ్యూన్ నో, ఇంకేదో అయితే పోయి బట్టలు చింపేసుకొని చూసేస్తాం. కొంచెం థియేటర్ లో అటెన్షన్ పెట్టి చూస్తే సినిమా అర్ధమవుతుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.