టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘పందెంకోడి’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న యాక్షన్ హీరో విశాల్, ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమయ్యారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మక 99వ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘మకుటం’ చిత్రంతో ఆయన కథానాయకుడిగానే కాకుండా దర్శకుడిగానూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్వర్గీయ ఆర్‌బీ చౌదరి నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ‘ది రైజ్ అఫ్ లింగా’ ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ అందుకోగా.. తాజాగా ఆదివారం (జూన్ 28) నాడు ఈ సినిమా నుంచి ‘నచ్చాకే వచ్చేరా’ అనే సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. చిత్రయూనిట్ సమక్షంలో జరిగిన ఈ వేడుకలో విశాల్, అంజలి సహా పలువురు ప్రముఖులు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. “ఒక దర్శకుడిగా ‘మకుటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నిజానికి రామ్ గోపాల్ వర్మ గారి ‘శివ’ సినిమా చూసినప్పుడే నేను దర్శకుడిని అవ్వాలని బలంగా ఫిక్స్ అయ్యాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. ఈ తరుణంలో నిర్మాత ఆర్‌బీ చౌదరి గారిని నేను చాలా మిస్ అవుతున్నాను. ఆయన బ్యానర్ నుంచి పరిచయమైన దర్శకుల్లో నేను 45వ వాడిని కావడం విశేషం. కొన్ని అనివార్య కారణాల వల్లే నేను ఈ ప్రాజెక్ట్‌కు మెగాఫోన్ పట్టాల్సి వచ్చింది. నాపై నమ్మకంతో 99వ సినిమా బాధ్యతలు అప్పగించినందుకు వారికి కృతజ్ఞతలు.
ఈ సినిమా కోసం నా వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి ఏడాది పాటు రాత్రింబవళ్లు కష్టపడ్డాను. నా ప్రయాణంలో సాయి ధన్సిక ఎంతో అండగా నిలిచారు. జీవీ ప్రకాష్ అందించిన ‘లింగా’ పాటలో నాతో పాడించి ఆయన పెద్ద రిస్క్ తీసుకున్నారు (నవ్వుతూ). ఇక ‘నచ్చాకే వచ్చేరా’ పాటను సింగర్ ప్రభ అద్భుతంగా పాడారు. గత 22 ఏళ్లలో 35 సినిమాలు చేశాను. నా తండ్రి జీకే రెడ్డి గారు పట్టుబట్టి ‘పందెంకోడి’ని తెలుగులో రిలీజ్ చేయకపోతే ఈరోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదు. నన్ను నటుడిగా ఆదరించినట్లే, ఈ సరికొత్త ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సినిమా గురించి నేను ఎక్కువ చెప్పను, థియేటర్లలో మీరే చూసి మాట్లాడతారు” అని ధీమా వ్యక్తం చేశారు.

