తమిళనాడులో అజిత్, విజయ్ ఫాన్స్ కి మధ్య ఫ్యాన్ వార్ పీక్ స్టేజ్ లో జరుగుతూ ఉంటుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా ఈ ఇద్దరు హీరోల అభిమానులు రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ ఫ్యాన్ వార్ ని మరింత పెంచుతూ అప్పుడప్పుడూ అజిత్, విజయ్ లు తమ సినిమాలని ఒకేసారి రిలీజ్ చేసి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి, ఒక్క రోజు గ్యాప్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ ఒకే రోజు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుగుడా జరిగే సంఘటన. మేకర్స్ కూడా అజిత్, విజయ్ ల సినిమాలని ఒకే రోజు రిలీజ్ చేస్తే తమ సినిమాకి ఓపెనింగ్స్ తగ్గుతాయి అనే ఆలోచనతో ఒక రోజు అటు ఇటు చూసుకోని రిలీజ్ చేస్తుంటారు. అందుకే అజిత్, విజయ్ ల బాక్సాఫీస్ ఫైట్ లో ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అరుదైన సంఘటననే ఈ సంక్రాంతికి జరగబోతోంది.
ఈ సంక్రాంతికి అజిత్ నటిస్తున్న ‘తునివు’, విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. ముందు నుంచీ అనుకుంటున్న షెడ్యూల్స్ ప్రకారం అయితే తునివు సినిమా జనవరి 11న, వారసుడు సినిమా జనవరి 12న రిలీజ్ అవ్వాల్సి ఉన్నాయి. ఒక్కరోజు గ్యాప్ లో తల, దళపతి పోటి పడుతున్నారు అంటూ కోలీవుడ్ వర్గాలు కూడా లెక్కలు వేసుకున్నాయి. అయితే వారసుడు సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఉన్న ఒక్క రోజు గ్యాప్ ని కూడా చెరిపేస్తూ వారసుడు సినిమాని కూడా జనవరి 11నే ఆడియన్స్ ముందుకి తీసుకోని వస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. ఊహించని ఈ సేమ్ డేట్ అనౌన్స్మెంట్ కి సినీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. దిల్ రాజు ఎందుకు అంత అవుట్ రైట్ గా పోటికి దిగుతున్నాడో ఎవరికీ అర్ధం కావట్లేదు. తెలుగులో వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు జనవరి 12, 13 తారీఖుల్లో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు వారసుడు సినిమాని రిలీజ్ చెయ్యడం కన్నా కాస్త ముందు రిలీజ్ చేస్తే వారసుడు సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి అనేది దిల్ రాజు ప్లాన్ లా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల వరకూ దిల్ రాజు ప్లాన్ బాగానే ఉంది కానీ తమిళనాడులో మాత్రం దిల్ రాజు ప్లాన్ ఫ్యాన్ వార్ ని పెంచేలా ఉంది.
అభిమానుల గొడవల గురించి తెలిసి కూడా ఒకే రోజు రిలీజ్ అనే విషయాన్ని విజయ్ ఎలా ఒప్పుకున్నాడో ఎవరికీ అంతుబట్టని విషయంలా ఉంది. విజయ్, అజిత్ తో పోటీ కోసం కావాలనే జనవరి 11న రిలీజ్ డేట్ కి ఒప్పుకున్నాడు అనే వాళ్లు కూడా ఉన్నారు. దాదాపు 2014 తర్వాత మళ్లీ జరగనున్న ఈ క్లాష్ లో ఎలా అయిన గెలిచి తానీ కోలీవుడ్ నంబర్ 1 హీరో అని నిరూపించాలని విజయ్ భావిస్తున్నాడో లేక వారసుడు సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి టాలీవుడ్ లో తానే నంబర్ 1 ప్రొడ్యూసర్ అని దిల్ రాజు నిరూపించాలని ప్లాన్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి వారసుడు సినిమా ‘తునివు’ విడుదల అవుతున్న రోజే రిలీజ్ అవ్వనుంది. మరి ఇది ఎలాంటి ఫ్యాన్ వార్ కి దారి తీస్తుందో చూడాలి.