మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రస్థానం ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తాడు. అనంతరం విలక్షణ పాత్రలు పోషించడం కూడా మొదలుపెట్టాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్నా సరే.. పాత్ర నచ్చిందంటే చాలు, చేసేస్తాడు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి, దానికి జీవం పోస్తాడు. ఇలా తనని తాను బిల్డ్ చేసుకుంటూ.. పాన్ ఇండియా నటుడిగా అవతరించాడు. ఫలితంగా.. ఈయనకు క్రేజీ ఆఫర్లు వరుసగా వస్తున్నాయి.
‘పుష్ప’లో తొలుత విజయ్ సేతుపతినే విలన్ పాత్రకు ఎంపిక చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. కొన్నాళ్లు ఆయన చిత్రబృందంతో ట్రావెల్ చేశారు కూడా! ఆ తర్వాత డేట్స్ ఇష్యూస్ రావడం, ఇతర కారణాల వల్ల విజయ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో, ఆయన స్థానంలో ఫహాద్ ఫాజిల్‌ని తీసుకున్నారు. ఇప్పుడు ‘పుష్ప2’లో విజయ్‌ను ఓ కీలక పాత్ర కోసం రంగంలోకి దింపారని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప: ద రైజ్’ సినిమా పాన్ ఇండియా హిట్ కావడంతో.. పుష్ప: ద రూల్ కోసం సుకుమార్ చాలా మార్పులు చేస్తోన్న సంగతి తెలిసిందే! కథని మొత్తం మార్చేయడమే కాదు, కొత్త కొత్త పాత్రల్ని డిజైన్ చేస్తున్నాడు. అందుకోసం ఆయా సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నాడు.
ఈ క్రమంలోనే తాను డిజైన్ చేసిన క్రేజీ పాత్రల్లో ఒకదానికి విజయ్ సేతుపతి సరిగ్గా సూటవుతాడని భావించి, ఆయన్ను సుకుమార్ ఎంపిక చేశాడని టాక్ వినిపిస్తోంది. విజయ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఫహాద్ ఫాజిల్ చేస్తోన్న నెగెటివ్ రోల్‌కి సమానంగా విజయ్ పాత్ర పవర్ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. అయితే, దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే మాత్రం.. పుష్ప: ద రూల్‌కి మరో ప్రత్యేక ఆకర్షణ తోడైనట్టే!