Vijay Setupathi: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉన్నవారందరూ తమలోని ప్రతిభను అందరు గుర్తించాలని కోరుకుంటారు. ఒక లాంటి పాత్రలకే అంకితమవ్వకుండా అన్ని పాత్రలు చేసి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు. అలాంటివారు ఒక దగ్గరే ఆగిపోరు. వారికి ఆడంబరాలు అవసరం లేదు. ఇక అలాంటి నటులలో ఒకడు విజయ్ సేతుపతి. సైడ్ క్యారెక్టర్స్ టూ స్టార్ హీరోగా మారిన విజయ్ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారాడు. ఇక ఒక్క హీరోగానే కాకుండా నటుడిగా ఎదగడానికి విజయ్ ప్రయత్నిస్తున్నాడు. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో, హీరోగా కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు.
అభిమానులంటే విజయ్ కు అమితమైన ప్రేమ. అతనిని చూడడానికి వచ్చిన వారందరిని మంచిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడం విజయ్ స్టైల్. అయితే మొదటి సారి విజయ్, అభిమానులపై సీరియస్ అయ్యాడు. తనను పాన్ ఇండియా స్టార్ అని పిలవద్దని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్నీ ఎన్నిసార్లు చెప్పినా చాలామంది పాన్ ఇండియా స్టార్ విజయ్ సేతుపతి అని పిలుస్తూ ఉండడంతో ఒక ఇంటర్వ్యూలో వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. “నేను పాన్ ఇండియా స్టార్ ను కాదు.. కేవలం నటుడును మాత్రమే. నన్ను పాన్ ఇండియా స్టార్ అని పిలవద్దు అని చెప్పాను. అలా పిలవకండి.. దానివలన నేను ఒత్తిడికి లోనవుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి జవాన్, క్రిస్టమస్, అరణ్మనై 4, గాంధీ టాక్స్, ముంబైకార్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.