KGF 3: కన్నడ స్టార్ హీరో యష్ ను పాన్ ఇండియా హీరోగా నిలబెట్టిన సినిమా కెజిఎఫ్. ఒక ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు యష్. కెజిఎఫ్ లో అతని నటన, ఆహార్యం, రాఖీ భాయ్ గా యష్ మారిన విధానం అద్భుతం. నిజం చెప్పాలంటే యష్ లేని కెజిఎఫ్ ను ఊహించుకోవడం కష్టం. కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 చిత్రాల తరువాత యష్ మరో సినిమాను అంగీకరించలేదు కూడా. ఇక కెజిఎఫ్ 2 చివరిలో కెజిఎఫ్ 3 కూడా ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా..? యష్ ఏ రకంగా కెజిఎఫ్ 3 లో కనిపిస్తాడా..? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయంలో కెజిఎఫ్ నిర్మాత పెద్ద బాంబ్ పేల్చాడు. కెజిఎఫ్ 3 లో యష్ ఉండడని చెప్పి షాకిచ్చాడు.
హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” కెజిఎఫ్ 3 2025 లో ఉంటుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాతనే కెజిఎఫ్ 3 ఉండనుంది. అయితే ఈసారి ఆ సినిమాలో యష్ ప్లేస్ లో మరో కొత్త హీరో ఉంటాడు. జేమ్స్ బాండ్ సిరీస్ లో ప్రతిసారి హీరోలు మారుతున్నట్లు ఇక్కడ కూడా కొత్త హీరోను తీసుకొనే అవకాశం ఉంది” అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యష్ లేని కెజిఎఫ్ ను ఊహించుకోవడం కష్టమని, అలాంటి హీరోను మ్యాచ్ చేసే హీరో దొరకడం కూడా కష్టమని అంటున్నారు. అసలు నిర్మాత ఇలా అనడానికి కారణం ఏమై ఉంటుంది.. వారిద్దరి మధ్య విబేధాలు ఏమైనా నెలకొన్నాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.