ప్రస్తుతం కెరీర్ పరంగా లోలో ఉన్న టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ‘ఊరమాస్’ విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యారు. దిల్ రాజు నిర్మాణంలో, ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ ప్రాజెక్టుకు ‘రౌడీ జనార్ధన’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా సాగిన ఈ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చూడని అత్యంత క్రూరమైన మాస్ అవతారంలో కనిపించారు. కండలు తిరిగిన దేహం, ఒళ్లంతా రక్తపు మరకలు, చేతిలో పదునైన కత్తితో శత్రువులను వేటాడుతున్న తీరు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
Also Read :Nari Nari Naduma Murari : ఎక్స్- ప్రెజెంట్ మధ్య మురారి
“కళింగపట్నంలో ఇంటికో ల* కొడుకు నేను రౌడీనని చెప్పుకు తిరుగుతడు. కానీ, ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే.. వాడే జనార్ధన.. రౌడీ జనార్ధన” అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈ సినిమా కేవలం విజయ్ మాస్ ఇమేజ్ మీద మాత్రమే కాకుండా, బలమైన కథ మరియు స్టార్ కాస్ట్‌తో రాబోతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా ఒక ప్రత్యేక పాత్రలో అలరించబోతున్నారు. 1980వ దశకంలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను దర్శకుడు రవికిరణ్ కోలా మలుస్తున్నారు.