ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈరోజే ఎదురయ్యింది.. అని పాడుకుంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార అభిమానులు.. ఎప్పుడెప్పుడు ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందా అని ఎదురుచూసిన వారికి ఈరోజు ఆ తరుణం రావడంతో సంబరబడిపోతున్నారు. అవును.. ఎట్టకేలకు ఆ ఇద్దరు ఒక్కటయ్యారు. కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విఘ్నేష్ శివన్ ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత ఐదేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్న విషయం విదితమే.. ఈ జంట గురించి చేసినన్ని పుకార్లు మరెవ్వరి గురించి చేయలేదంటే అతిశయోక్తి కాదు..ఈ ఇద్దరికి పెళ్లి అయిపోయిందని కొందరు.. ఇద్దరూ కలిసే ఉంటున్నారని మరికొందరు.. రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఎట్టకేలకు ఆ పుకార్లన్నింటికీ పెళ్లితో చెక్ పెట్టారు. ఈరోజు ఉదయం 2 గంటల 22 నిమిషాలకు మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో విఘ్నేష్, నయన్ మెడలో మూడుముళ్లు వేశాడు.
ఇక వీరి పెళ్లి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాళి కట్టాకా తన అందమైన ప్రేయసి నుదిటిపై ముద్దు పెడుతూ విఘ్నేష్ కనిపించగా.. ఇన్నిరోజులు కలను నిజం చేసుకున్న ఆనందంలో నయన్ ముఖం ఆనందంతో విరబూసింది. ఇక నయన్ పెళ్లి కూతురు ముస్తాబులో ఎంతో అందంగా కనిపిస్తుంది. గులాబీ రంగు చీరపై పచ్చ రంగు ఆభరణాలు ఆమె కు వన్నె తెస్తుండగా .. అప్పుడే మెడలో ప్రియుడు కట్టిన పసుపు తాడు హైలైట్ గా నిలిచింది. ఇక ఇది చూసిన అభిమానులు చిలకాగోరింకల్లా ఉన్నారు, నిండునూరేళ్లు కలిసి జీవించండి అని ఆశీస్సులు అందిస్తున్నారు.