జూ. ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న మారాజు. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే గుణం అతనిది. తానొక స్టార్ హీరోనన్న ఇగో ఏమాత్రం ఉండదు. తన తోటి నటీనటులతో ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాడు. ఎవరిని అడిగినా సరే.. తారక్ వ్యక్తిత్వాన్ని ప్రశంసించకుండా ఉండలేరు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటుడు విద్యుత్ సమ్వాల్ సైతం అదే పని చేశాడు. తన ఖుదా హాఫిజ్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన ఆయన.. తారక్ తో తనకున్న మంచి అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.
‘శక్తి’ సినిమా నుంచే తమ మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని, ‘ఊసరవెల్లి’తో అది మరింత బలపడిందని విద్యుత్ తెలిపాడు. తారక్ తన హీరో అని, ఇప్పటికీ తన హీరోనేనని అన్నాడు. తనతో కలిసి సినిమాలు చేసినప్పుడు తారక్ తనని స్టార్ లా ట్రీట్ చేశాడన్నాడు. అంతేకాదు.. తన కమాండో 2 సినిమాను చూడమని ప్రమోట్ కూడా చేశాడని, అందుకే అతనంటే తనకెంతో ఇష్టం, గౌరవమని పేర్కొన్నాడు. తారక్ ఒక గొప్ప డ్యాన్సర్ అని కొనియాడిన విద్యుత్.. అతడ్ని మొదట్లో కలిసినప్పుడే ‘‘నేను చూసిన గొప్ప డ్యాన్సర్లలో నువ్వే బెస్ట్’’ అని చెప్పానన్నాడు. తామిద్దరం మంచి స్నేహితులమని, హైదరాబాద్ లో అడుగుపెట్టిన మొదటి రోజే అతనికి కాల్ చేసి మాట్లాడానన్నాడు.
కాగా.. 2020లో వచ్చిన ‘ఖుధా హాఫిజ్’ సినిమాకు ‘ఖుదా హాఫిజ్ 2’ సీక్వెల్. కూతురు ఓ తండ్రి పడే వేదన నేపథ్యంతో ఈ సినిమా అల్లుకొని ఉంటుందని విద్యుత్ జమ్వాల్ తెలిపాడు. పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన మాటల్లో వర్ణించలేనిదని, ఈ సినిమాతో తాను ఆ అనుభూతి చెందానని, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా ఆ అనుభూతిని పొందుతారని వెల్లడించాడు. జులై 8వ తేదీన ఈ సినిమా రిలీజవుతోంది.