సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రేండింగ్ అంశం మీద వీడియోలు చేస్తూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా వైరల్ అవ్వాలని చూస్తూ ఉంటారు. సెలబ్రిటీల జాతకాలు చెప్పడం, అవి నెట్టింట వైరల్ కావడం, ఆ తర్వాత నెటిజన్ల నుంచి దారుణంగా ట్రోల్స్ ఎదుర్కోవడం ఆయనకు నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా ఆయన ఫోకస్ తమిళ ‘దళపతి’ విజయ్ రాజకీయ భవిష్యత్తుపై పడింది. అయితే, ఈసారి వేణుస్వామి చెప్పిన జోస్యాలు వింటుంటే.. ఇది నిజంగా జ్యోతిష్యమా? లేక కేవలం పబ్లిసిటీ స్టంటా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వేణుస్వామి తాజా అంచనా ప్రకారం.. విజయ్ రాజకీయ ప్రయాణంలో స్టార్ హీరోయిన్ ‘త్రిష’ పేరు ఒక పెద్ద అడ్డంకిగా మారిందట. ఒకవేళ త్రిష అనే ఫ్యాక్టర్ లేకపోతే విజయ్ జాతకం మరోలా ఉండేదని ఆయన సెలవిచ్చారు. అంతేకాకుండా, ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రి అయినా సరే.. ఆరు నెలలు లేదా మహా అయితే ఏడాది లోపే తమిళనాడులో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ సంచలన జోస్యం చెప్పారు. కానీ విజయ్ సన్నిహితులు, ఆయన ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన వారు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. త్రిష వల్లే విజయ్ ఈ స్థాయికి చేరుకున్నారని, ఆన్ స్క్రీన్ మీద వారిద్దరి కాంబినేషన్ ఒక సక్సెస్ ఫుల్ కెమిస్ట్రీ అని బలంగా చెబుతున్నారు. అయితే నెగటివ్ జోస్యాలు చెబుతూ ట్రెండ్ అవ్వడం ఆయనకు కొత్తేమీ కాదు. పేర్లు చెప్పకుండా ఒక ప్రముఖ హీరో చనిపోతాడు, ఒక ప్రముఖ హీరోయిన్ విడాకులు అంటూ రాశి ఫలాలు చెప్పి ఎవరో ఒకరికి అయ్యాక తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు అలవాటే.
