(జనవరి 10తో చంటి
కి 30 ఏళ్ళు)
చంటి పిల్లలంటే జనానికి భలే ఇష్టం. అలాగే చంటి
అన్న పేరు కూడా తెలుగువారికి ఎంతో ఇష్టమైనది. అదే తీరున చంటి
అన్న పేరుతో తెలుగునాట తెరకెక్కిన తొలి చిత్రాన్ని జనం విశేషంగా ఆదరించారు. వెంకటేశ్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కె.యస్.రామారావు నిర్మించిన చంటి
చిత్రం 1992 జనవరి 10న విడుదలై సంక్రాంతి సంబరాల్లో విజేతగా నిలచింది. వెంకటేశ్ ను తన తరం హీరోల్లో రీమేక్స్ కింగ్
గా నిలిపిన చిత్రం కూడా చంటి
యే! ఆ తరువాత అనేక రీమేక్స్ తో సక్సెస్ రూటులో సాగిపోయారు వెంకటేశ్. మీనా నాయికగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం పెద్ద ఎస్సెట్. తమిళనాట శివాజీగణేశన్ తనయుడు ప్రభు, ఖుష్బూ జంటగా నటించిన చిన్నతంబి
ఈ చిత్రానికి మాతృక.
చంటి
కథ కూడా చందమామ కథలను పోలి ఉంటుంది. ఓ రాజు తన కూతురుకు ప్రమాదం సంభవిస్తుందని భావించి, ఆమెను ఎవరి కంటా పడనీయకుండా ఒంటి స్తంభం మేడలో పెంచినట్టుగానే ఈ కథ మొదలవుతుంది. ఓ జమీందార్ల ఇంట ముగ్గురు అన్నలకు ఓ ముద్దుల చెల్లెలు ఉంటుంది. వారి ఇంటి జ్యోతిషుడు ఆమె పెళ్ళి ఓ సామాన్యునితో జరుగుతుందని చెబుతాడు. దాంతో ఆ అన్నలు తమ చెల్లెలు నందిని ఎవరి కంటా పడనీయకుండా పెంచుతూ ఉంటారు. ఆ ఊరిలో చంటి అనే అబ్బాయికి పెద్దగా చదువు లేకపోయినా, రాగయుక్తంగా పాటలు పాడే సహజ లక్షణం ఉంటుంది. అతను ఎంతో అమాయకుడు. దాంతో అందరూ అతని పాటను అభిమానిస్తూంటారు. జమీందార్ల చెల్లెలు సీమంతానికి చంటి పాటపాడతాడు. అతని అమాయకత్వం చూసి, తమ చెల్లెలుకు ఓ బాడీ గార్డ్ లా ఉంచుతారు అన్నలు. తొలిసారి ఇంట్లోంచి పారిపోయి, బయట ఉండే అందాలను చూస్తుంది. అందుకు చంటి సాయం తీసుకుంటుంది. ఓ సారి అనుకోకుండా చంటి, నందినిని రక్షించబోయి ఆమెను తాకుతాడు. దాంతో అన్నలు చితక్కొడతారు. అసలు విషయం తెలుసుకున్న తరువాత నుంచీ చంటిని మళ్ళీ తమ ఇంటికి రమ్మని తీసుకువెళతారు అన్నలు. చంటిపై నందిని మనసు పారేసుకుంటుంది. అతణ్ణే భర్తగా భావిస్తుంది. అతనితో తాళి కూడా కట్టించుకుంటుంది. ఈ విషయం అన్నలకు తెలిసి, చంటి తల్లిని అవమానిస్తారు. దాంతో చంటి నందిని అన్నలను చితకబాదుతాడు. చంటి లేని తన జీవితం వ్యర్థమనుకున్న నందిని విషం తాగుతుంది. నందిని అన్నలు తమ తప్పు క్షమించమని చంటిని, ఆమె తల్లిని వేడుకుంటారు. చంటి వచ్చి తన పాటతో ప్రియురాలు నందినికి స్పృహ తెప్పిస్తాడు. తరువాత చంటి, నందిని ఒక్కటవ్వడంతో కథ ముగుస్తుంది.
ఈ కథ నిజంగా ఓ జానపదం లాగే ఉంటుంది. అయినా, ఇళయరాజా స్వరకల్పనలో చంటి
కథ విజయపథంలో నడిచిందని చెప్పవచ్చు. తమిళ మాతృక అయిన ఈ కథ, తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. ఇదే కథతో కన్నడలో రవిచంద్రన్ హీరోగా రామాచారి
రూపొంది, అక్కడా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక వెంకటేశ్ తోనే హిందీలో ఆయన తండ్రి డి.రామానాయుడు ఈ కథను అనాడీ
పేరుతో రీమేక్ చేశారు. కె.మురళీమోహన రావు దర్శకత్వంలో రూపొందిన ఆ హిందీ చిత్రం కూడా హిట్ అయింది. ఇలా ఓ అమాయకపు పాటలు పాడే చంటి
కథ పలు భాషల వారిని మెప్పించింది.
ఈ చిత్రంలో చంటి తల్లిగా సుజాత నటించారు. నందిని అన్నలుగా నాజర్, వినోద్, ప్రసన్నకుమార్ కనిపించారు. మంజుల, సుధారాణి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, అనుజ, మహర్షి రాఘవ, మాస్టర్ రాఘవేంద్ర, మాస్టర్ సతీశ్, మాస్టర్ బిజ్జు, మాస్టర్ సురేశ్, బేబీ శ్రీలేఖ, బేబీ సులేఖ నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు పి.వాసు కథను అందించారు. ఈయన దర్శకత్వంలోనే తమిళ చిన్నతంబి
తెరకెక్కింది. తెలుగులో సత్యమూర్తి సంభాషణలు రాశారు. ఈ చిత్రానికి వేటూరి, సాహితీ పాటలు పలికించారు. అన్నుల మిన్నుల అమ్మడికన్నులు...
, ఎన్నెన్నో అందాలు...
, ఇది తైలం పెట్టి తాళంవేసే..
, పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం...
పాటలు అలరించాయి. జాబిలికి వెన్నెలకి...
అనే పాట రెండు వర్షన్స్ ఉంటుంది. అలాగే ఓ ప్రేమా...
అంటూ సాగే పాట కూడా రెండు వర్షన్స్ లో వినిపిస్తుంది. మొత్తం 8 పాటలున్న ఈ చిత్రం ఆడియో కూడా పెద్ద హిట్ గా నిలచింది.
ఈ సినిమాకు నాలుగు నంది అవార్డులు లభించాయి. వాటిలో వేటూరి రాసిన పావురానికి పంజరానికి...
పాట ద్వారా ఆయనకు ఉత్తమ గేయరచయితగా అవార్డు లభించింది. ఉత్తమగాయకునిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉత్తమ విలన్ గా నాజర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా శోభాలత నందులు అందుకున్నారు. చంటి
చిత్రం దాదాపు 40 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుకంది. రజతోత్సవం కూడా చూసిన ఈ సినిమా 1992 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది.