టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ‘వారిసు’ సినిమా తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల కానుంది. ఇది బైలింగ్వల్ మాత్రమే కాదు ‘వారిసు’ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుందంటూ దిల్ రాజు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటివరకూ వారిసు సినిమాని ద్విభాషా చిత్రంగానే చూశారు అలాంటిది దిల్ రాజు హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనడంతో వారిసు మూవీ ఇప్పుడు త్రిభాషా చిత్రం అయ్యింది. అయితే ‘వారిసు’ నుంచి ఇప్పటికే ‘రంజితమే’ సాంగ్ బయటకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది, రెండో పాటని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. తెలుగు వెర్షన్ ‘వారసుడు’ నుంచి మాత్రం ఒక్క సాంగ్ కూడా బయటకి రాలేదు, ఇక హిందీ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు ప్రమోషన్స్ నే అంతంతమాత్రంగా చేస్తున్న దిల్ రాజు అండ్ టీం ఇక హిందీ ప్రమోషన్స్ ని ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.
ఇదిలా ఉంటే వారిసు సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నారు అనే వాదన చాలా రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ విషయంపై ఇటివలే ఒక టాక్ షోలో మాట్లాడిన దిల్ రాజు… “థియేటర్ ఓనర్స్ తో తనకున్న మంచి సంబంధాల కారణంగా సంక్రాంతి బరిలో ఉన్న వారసుడు, వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాల్లో తన సినిమాకే మంచి థియేటర్స్, క్వాలిటీ ఉన్న స్క్రీన్స్ వస్తాయని” కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. ఎక్కువ థియేటర్స్ వారసుడు సినిమాకి వస్తాయని దిల్ రాజు చెప్పలేదు కానీ మంచి థియేటర్స్ మాత్రం తన సినిమాకే వస్తాయని చెప్పాడు. అయితే ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చెయ్యట్లేదు కాబట్టి నైజాం ప్రాంతంలో దాదాపు 60% థియేటర్స్ ని ‘వారసుడు’ కోసమే బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే తెలుగు స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్ లో కోత పడే అవకాశం ఉంది.