Vamsy: ప్రముఖ రచయిత వంశీ నలభై ఏళ్ళ క్రితం ‘మంచుపల్లకి’ మూవీతో దర్శకుడిగా మారారు. యుక్తవయసులోనే కలం పట్టిన ఆయన దర్శకుడిగా మారకముందే పలు కథలు, నవలలు రాసి బహుమతులు అందుకున్నారు. ప్రముఖ దర్శకులు వి. మధుసూదనరావు, కె. విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు, కొమ్మినేని శేషగిరిరావు, భారతీరాజా వంటి వారి దగ్గర వంశీ దర్శకత్వ శాఖలో పనిచేశారు. 1982లో దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ చేతపట్టిన వంశీ, గడిచిన నలభై సంవత్సరాలలో తెరకెక్కించింది కేవలం ఇరవై ఆరు సినిమాలే! అయితే అందులో ఘన విజయం సాధించిన సినిమాలు వంశీని అగ్రదర్శకుల జాబితాలోకి చేర్చేశాయి. తొలి చిత్రం నుండి తనకంటూ ఓ మేకింగ్ స్టైయిల్ ను వంశీ క్రియేట్ చేసుకున్నారు. దాంతో ఓ బాపు, ఓ విశ్వనాథ్, ఓ వంశీ… అంటూ ఆయనకూ ప్రత్యేక గుర్తింపు లభించింది.
విశేషం ఏమంటే కథా రచయితగా, నవలా రచయితగా లబ్ద ప్రతిష్ఠులైన వంశీ… ఇప్పుడు తన సినిమాల తెరవెనుక కథలతో పాఠకులను ఆకట్టుకున్నారు. తాను దర్శకత్వం వహించిన సినిమాల రూపకల్పన నేపథ్యాన్ని తనదైన శైలిలో వివరిస్తూ కొంతకాలం క్రితం స్వాతి వార పత్రికలో ‘ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి’ పేరుతో ధారావాహికగా వ్యాసాలు రాశారు. మొదటి చిత్రం ‘మంచుపల్లకి’తో మొదలై ‘సితార, అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, ఆలాపన, లేడీస్ టైలర్, లాయర్ సుహాసిని, మహర్షి, శ్రీ కనకమాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చెట్టుకింద ప్లీడరు, స్వరకల్పన’ వరకూ ఈ వ్యాస పరంపర సాగింది. మొత్తం పదకొండు సినిమాల మేకింగ్ ముచ్చట్లను ఈ వ్యాసాలలో వంశీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. లక్షలాది పాఠకులకు ఆకట్టుకున్న ఈ వ్యాసాలు ఇప్పుడు పుస్తక రూపంలోనూ వచ్చాయి. కేవలం సినిమాలకు సంబంధించిన వివరాలే కాకుండా వాటి వర్కింగ్ స్టిల్స్ తో పాటు అందమైన కాప్షన్స్ తో అందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రత్యేక ఛాయా చిత్రాలనూ వంశీ పొందుపరిచారు. భారతీయ సినీ సాహిత్యంలో చాలా మంది రచయితలు పలువురు దర్శకుల సినిమాల గురించిన పుస్తకాలు తీసుకొచ్చారు. కానీ ఓ దర్శకుడు తాను తెరకెక్కించిన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని, రూపకల్పన విశేషాలను తానే వ్యాసాలుగా రాసి పుస్తకంగా తీసుకురావడం ఇదే ప్రథమం.
ఈ విషయం గురించి వంశీ మాట్లాడుతూ, ”గతంలో ఇలాంటి పుస్తకాలేవీ రాలేదని కొందరు చెబుతున్నారు. బహుశా నిజమే కావచ్చు. మొదటి నుండి నాకు రాసే అలవాటు ఉండటం చేత నా సినిమాల నిర్మాణ పూర్వాపరాలను నేనే రాసుకుంటూ వెళ్ళాను. స్వాతి వీక్లీలో ఇవి వచ్చినప్పుడు విశేష ఆదరణ లభించింది. సోషల్ మీడియాలోనూ వేలాదిమంది వాటిని చదివి ఆనందించారు. ఒక్కసారి నా కెరీర్ ప్రారంభ దినాలను తలుచుకోవడం నాకూ కొంత సంతోషాన్ని కలిగించింది. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలోని నాయని కృష్ణమూర్తి గారి కుటుంబంతో నాది నలభై యేళ్ళ అనుబంధం. ‘మా బడి’, ‘పాఠశాల’ వంటి పత్రికలను ప్రచురించిన వారికి చెందిన విజయవాణి ప్రెస్ లోనే ఈ పుస్తకం కూడా ప్రింట్ అయ్యింది. నేను రాసిన గత పుస్తకం ‘పొలమారిన జ్ఞాపకాలు’కు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ముందు మాట రాశారు. దాన్ని ఆ పుస్తకంలో ప్రచురించలేకపోయాను. ఇవి కూడా ఓ రకంగా నా చిత్రాలకు సంబంధించిన జ్ఞాపకాలే కాబట్టి… ఆ ముందుమాటను ఈ పుస్తకంలో వాడాను. విజయవాడకు చెందిన సాహితి ప్రచురణలు సంస్థ ఈ పుస్తకం పంపిణీ బాధ్యతలు తీసుకుంది” అని అన్నారు. ఈ పుస్తకంలో తాను దర్శకత్వం వహించిన తొలి 11 సినిమాల గురించే రాశానని, పాఠకుల స్పందన బట్టి మిగిలిన చిత్రాల గురించి రాసే ప్రయత్నం చేస్తానని వంశీ తెలిపారు. ఇది ఆయన నుండి వచ్చిన 17వ పుస్తకం.
‘ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి’ లాంటి పుస్తకం గతంలో రాలేదని, దీన్ని చదువుతుంటే, ఆణిముత్యాలన్నింటినీ ఓ చోట పోగుచేసిపెట్టినట్టుగా అనిపించిందని ప్రముఖ సినీ విమర్శకులు కొంపల్లి గౌరీశంకర్ తెలిపారు. ‘దర్శకుడు వంశీ తన సినిమా కథల రూపకల్పన, మ్యూజిక్ సిట్టింగ్స్ విశేషాలను తెలిపిన తీరు అద్భుతమ’ని రైల్వే ఉన్నతాధికారి రవి పాడి అన్నారు. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నాటి సినిమాల విశేషాలను వంశీ తన మనసు పొరలను విప్పి ఎంతో నిజాయితీతో చెప్పారని, అందుకే వీటికి అంతటి ప్రాచుర్యం లభించిందని రవి పాడి చెప్పారు. దర్శకుడిగా వంశీ సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నట్టుగానే, రచయితగానూ ఆయన్ని అభిమానించేవారు కోకొల్లలు. చిత్రం ఏమంటే… ఇది ఆయన సినిమాలకు సంబంధించిన రచన కావడంతో… ఆ రెండు వర్గాలను ‘ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి’ పుస్తకం విశేషంగా ఆకట్టుకునే ఆస్కారం ఉంది. వెలకట్టలేని ఈ గ్రంధాన్ని ఒక్కసారి చదివితే రెండో దాని కోసం ఎదురుచూడటం అనివార్యమౌతుంది!!