Urvasivo Rakshasivo Teaser: అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ లో ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం దీనిని నిర్మిస్తున్నారు. నవంబర్ 4న మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో గురువారం టీజర్ ను రిలీజ్ చేశారు. 78 సెకన్లు ఉన్న ఈ టీజర్ మొత్తం యూత్ ను టార్గెట్ చేస్తూ సాగింది. గాఢ చుంబనాలతో మొదలై, బిగి కౌగిలింత మీదుగా గెస్ట్ హౌస్ లో రొమాన్స్ తో పూర్తయ్యింది.
అల్లు వారి చిన్నబ్బాయి ఇంట్లో బుద్ధిమాన్.. బయట శక్తిమాన్ అనే రీతిలో టీజర్ సాగింది. ఈ రొమాంటిక్ మూవీని ‘విజేత’ ఫేమ్ రాకేశ్ శశి డైరెక్ట్ చేశాడు. అయితే అంతర్లీనంగా ప్రేమకి, స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతోంది. స్మాల్ గ్యాప్ తర్వాత శిరీష్ నుంచి ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా అంచనాలను అందుకుంటుంది అనే నమ్మకం కలుగుతుంది. కేదార్ శంకర్, ఆమని, పోసాని, ‘వెన్నెల’ కిశోర్, సునీల్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.