University Movie: స్నేహచిత్ర పతాకంపై పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన సినిమా ‘యూనివర్సిటీ’. ఆర్. నారాయణమూర్తి ఇందులో యూనివర్సిటీ వి.సిగా, ఎస్.ఐ. గా ద్విపాత్రాభినయం చేశారు. ప్రముఖ నటుడు కృష్ణేశ్వరరావు ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మీడియాతో పాటు మేధావులకు సోమవారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీల కారణంగా ప్రభుత్వ విశ్వ విద్యాలయాలకు ఎలాంటి నష్టం వాటిల్లుతోంది? అందులోని ఉపాధ్యాయులను అధిక జీతాల ఎర చూపించి ప్రైవేట్ సంస్థలు ఎలా తమ వైపు తిప్పుకుంటున్నాయి? కష్టపడి చదువుకున్న విద్యార్థులు బడాబాబులు చేసే పేపర్ లీకేజీలతో ఎలాంటి దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు? అనే అంశాలను ఈ సినిమాలో ఆర్. నారాయణమూర్తి చూపించారు.
చిత్ర ప్రదర్శన అనంతరం ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, “సినిమాలో ఆర్. నారాయణమూర్తి చూపించిన అంశాలు అందరినీ ఆలోచింప చేస్తాయి. విద్యావ్యవస్థ లోని లోటుపాట్లను, అక్కడి అరాచక విధానాన్ని ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు. విద్య, వైద్యం వంటి వాటిని జాతీయం చేయాలని, ప్రైవేట్ పరం చేస్తే యువతకు ఎంతో నష్టం వాటిల్లుతుందని నారాయణమూర్తి చాలా స్పష్టంగా తెలిపారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోపించ చేస్తుంది” అని అన్నారు. ‘ఇవాళ విద్య, ఉద్యోగ రంగాలలో ఎలాంటి పొరపాట్లు జరుగుతున్నాయో నారాయణమూర్తి చాలా స్పష్టంగా, నిర్మొహమాటంగా ఇందులో చూపించారని, ఇది అందరికీ కనువిప్పు కావాల’ని టీఎస్‌పీఎస్సీ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. యూనివర్సిటీల్లో జరుగుతున్న అసంబద్ధ, అసాంఘీక కార్యకలాపాలను ఆర్. నారాయణ మూర్తి చక్కగా తెరకెక్కించారని ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు అన్నారు. సామాజికాంశాలను తనదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు నాలుగు దశాబ్దాలుగా తీసుకెళుతున్న నారాయణమూర్తి అభినందనీయులని, ఆయన తాజా చిత్రం ‘యూనివర్సిటీ’ విజయవంతం కావాలని కోరుకుంటున్నామని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి. లక్ష్మీనారాయణ, వై. జె. రాంబాబు అభిలషించారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరిస్తే జరిగే దారుణాల గురించి నారాయణమూర్తి చాలా చక్కగా ఈ సినిమా ద్వారా తెలిపారని సీనియర్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ చెప్పారు.
కార్పొరేట్ రంగాల చేతుల్లోకి వెళ్ళిన విద్య ఇవాళ సామాన్యుడికి అందని ద్రాక్షగా మారిపోయిందని, లక్షలు ఖర్చుపెట్టి డిగ్రీ తీసుకున్న విద్యార్థులు ఉద్యోగాన్ని పొందే సమయంలో పేపర్ లీకేజీ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆర్. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి వారు ఈ విషయంపై దృష్టి పెట్టి, దోషులకు కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాను ఇదే నెల 26న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతున్నట్టు ఆర్. నారాయణమూర్తి తెలిపారు.