Uday Shankar Birthday Special :
‘ఆటకదరా శివ’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీరామ్ తనయుడు ఉదయ్ శంకర్. ఆ తర్వాత ‘మిస్ మ్యాచ్, క్షణక్షణం’ చిత్రాలలోనూ హీరోగా నటించాడు. ప్రస్తుతం అతను ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ మూవీలో నటిస్తున్నాడు. జూలై 19 ఉదయ్ శంకర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం బర్త్ డే వేడుకలను నిర్వహించింది. ఈ సినిమా గురించి దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ, ”ఈ తరం కుర్రవాళ్ళు తమకు కావలసిన వాటిని పొందటానికి ఎంత దూరమైన వెళుతున్నారు. అలా ఇందులో కథానాయకుడు తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్ళాడు? అనే దానిని ఆసక్తికరంగా చూపబోతున్నాం. గోవాలో చిత్రీకరించాల్సిన పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది” అని చెప్పారు. ఈ మూవీని డాక్టర్ సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో శ్రీరామ్ మూవీస్ పతాకంపై అల్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. దర్శకుడు గురు పవన్ గతంలో రోడ్ జర్నీ నేపథ్యంలో ‘ఇదే మా కథ’ చిత్రాన్ని రూపొందించాడు.
హీరో ఉదయ్ శంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ”చంద్ర సిద్దార్థ్ గారి దర్శకత్వంలో ‘ఆట కదరా శివ’తో నా జర్నీ స్టార్ట్ అయ్యి రేపటికి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నాలుగేళ్ళలో ఈ సినిమాతో కలిపి నాలుగు చిత్రాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు గురు పవన్ మంచి కథను సెలెక్ట్ చేసుకుని కమర్షియల్ లవ్ స్టోరీ గా దీనిని తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ జెన్నీఫర్ కొత్త అమ్మాయి అయినా చాలా చక్కగా నటించింది. ఇందులో మధునందన్ నా ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాడు. అలాగే శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రి భార్గవి, ‘ఆచార్య’ ఫేమ్ సౌరవ్… ఇలా అనేకమంది ఇందులో ఉన్నారు. నా ‘మిస్ మ్యాచ్’ సినిమాకు సంగీతం అందించిన గిఫ్టన్ ఎలియాస్ దీనికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన అత్యధిక భాగం షూటింగ్ వైజాగ్ లో చేశాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లూరి నారాయణరావు, దర్శకుడు గురు పవన్, సంగీత దర్శకుడు గిప్టన్, నటుడు మధునందన్, కెమెరామ్యాన్ సిద్ధం మనోహర్ తదితరులు పాల్గొని ఉదయ్ శంకర్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.