‘అన్నమయ్య’ అన్న పదం వింటే చాలు తెలుగువారి మదిలో ఆయన పలికించిన పదకవితలు చిందులు వేస్తాయి. ‘తెలుగు పదకవితాపితామహుని’గా చరిత్రలో నిలచిన ‘అన్నమాచార్య’ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించాలని పలువురు ప్రయత్నించారు. అలాంటి వారిలో కవి, దర్శకులు ఆచార్య ఆత్రేయ, నటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం, రచయిత, దర్శకుడు జంధ్యాల వంటివారు ఉన్నారు. వారి ప్రయత్నాలు కార్యరూపం దాల్చకపోయినా, కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వి.యమ్.సి. దొరస్వామి రాజు చేసిన ప్రయత్నం ‘అన్నమయ్య’ సినిమాగా రూపొంది జనాన్ని విశేషంగా అలరించింది. ‘అన్నమయ్య’గా నటించిన నాగార్జున ఈ నాటికీ ఆ పేరు వినగానే, జనానికి గుర్తుకు వచ్చేలా నటించేశారు. అన్నమయ్య జయంతి అయిన మే 22న, 1997లో ఈ సినిమా జనం ముందు నిలచింది. వారి మనసులు గెలిచింది.
నిజానికి కె.రాఘవేంద్రరావు అనగానే తెలుగు సినిమాకు సరికొత్త కమర్షియల్ ఫార్ములా అందించిన ఘనుడు అని పేరుంది. ఇక నాగార్జున “గీతాంజలి, శివ, నిన్నే పెళ్ళాడతా” వంటి చిత్రాల్లో నటించి అలరించిన నటుడు. వీరిద్దరు అంతకు ముందు “అగ్నిపుత్రుడు, ఆఖరి పోరాటం, అగ్ని, ఘరానాబుల్లోడు” వంటి చిత్రాల కోసం కలసి పనిచేశారు. వీటిలో “ఆఖరి పోరాటం, ఘరానాబుల్లోడు” మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబోలో వెలుగు చూసిన అన్ని చిత్రాల్లోనూ కమర్షియల్ హంగులు చాలానే ఉన్నాయి. దాంతో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున అన్నమయ్యగా నటిస్తున్నాడని చెప్పగానే చాలామంది పెదవి విరిచారు. ఎందుకంటే అంతకు ముందు రాఘవేంద్రరావు భక్తిరస ప్రధానమైన చిత్రాలను తెరకెక్కించలేదు. ఆయన చిత్రాల్లో రక్తి మెండుగా కనిపించేది. ఇక నాగార్జున వైవిధ్యమైన యాక్షన్ మూవీస్ హీరో. మరి ప్రేక్షకులకు సందేహం కలుగకుండా ఉంటుందా? పైగా అన్నమయ్య అనగానే మనకు అనేక చిత్రపటాల్లో తంబుర పట్టుకొని నెత్తిన గోపురం వంటి కిరీటం పెట్టుకొని మీసాలు లేకుండా కనిపించే అన్నమయ్యే గుర్తుకు వస్తారు. అయితే నాగార్జునను మీసాలు, గడ్డాలతో చూపించడం చేస్తున్నారనగానే భక్తకోటికి ‘అన్నమయ్య’ సినిమాపై నిరాసక్తి కలిగిన మాట వాస్తవమే!
ఏమైతేనేమి ‘అన్నమయ్య’ చిత్రం రూపొందింది. జనం ముందు నిలిచాక, వారు అన్నీ మరచి సినిమాను ఆదరించడం విశేషం! ‘అన్నమయ్య’ సినిమా కథ విషయానికి వస్తే – భక్తజనుల కీర్తనలు వింటూ ఆనందించిన శ్రీనివాసుడు, తెలుగులో పద సంకీర్తనలు వినలాని తలచారు. తన నందకం ఖడ్గాన్ని భూలోకంలో అన్నమయ్యగా జన్మింప చేశారు. ఆయనకు వరసయ్యే ఇద్దరు మరదళ్ళనూ సృష్టించారు. యవ్వనంలో మరదళ్ళతో ఆటపాటలు ఆడుకుంటూ గడుపుతున్న అన్నమయ్యలో భక్తిబీజం నాటి, తన చెంతకు రప్పించుకున్నారు స్వామివారు. కలలో కనిపించిన స్వామివారిని చూడటానికి తిరుమల వెళ్ళిన అన్నమయ్య అక్కడే ఉండిపోయారు. ఆయనను తీసుకు రావడానికి ఇంటిల్లి పాది బయలు దేరారు. అప్పుడు మళ్ళీ స్వామివారు అన్నమయ్యను సంసారంలోకి నెట్టారు. దగ్గరుండి మరీ పెళ్ళి జరిపించారు. అన్నమయ్య పదకవితలు వింటూ ఆనందించారు. తన పాటలు ఆ శ్రీవేంకటేశ్వరునికే అంకితమని అన్నమయ్య భావించారు. సాలువ నరసింహ రాజు తన భార్యపై కావ్యం రాయమని అన్నమయ్యను కోరడం, అందుకు ఆయన తిరస్కరించడం, చెరబట్టడం, స్వామివారు భక్తుని విడిపించడం అన్నీ జరిగిపోతాయి. ఇహ సౌఖ్యాలను ఆశించిన అన్నమయ్య భార్యలకు కనువిప్పు కలిగి తనువు చాలిస్తారు. తరువాత సంఘంలోని దురాచారాలను సైతం ఖండిస్తూ అన్నమయ్య పలు రచనలు చేశారు. వాటిని స్వామివారికి సమర్పించారు. తాను అలసిపోయానని అన్నమయ్య గానం చేయగా, విని శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు చలించి పోయారు. మరింత కాలం జీవించి సంకీర్తనలు పలికించమని స్వామివారే కోరారు. భక్తుడు వినలేదు. చివరకు భక్త అన్నమయ్యను తనలో ఐక్యం చేసుకున్నారు స్వామివారు. ఈ కథతో తెరకెక్కిన ‘అన్నమయ్య’ చిత్రం జనాన్ని భలేగా అలరించింది.
నాగార్జున అన్నమయ్యగా నటించిన ఈ చిత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటించారు. అన్నమయ్య భార్యలు తిమ్మక్క, అక్కలమ్మలుగా రమ్యకృష్ణ, కస్తూరి అభినయించారు. శ్రీదేవి, భూదేవిగా భానుప్రియ, శ్రీకన్య కనిపించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, రోజా, ఎమ్.బాలయ్య, శివపార్వతి, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మల్లికార్జునరావు, చిట్టిబాబు, అనంత్ బాబు, సుత్తివేలు, జెన్నీ, ఫైట్ మాస్టర్ రాజు ఇతర ముఖ్యపాత్ర ధారులు.
‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రానికి ఆచార్య ఆత్రేయ రచన చేయగా, ఆయన వద్ద శిష్యరికం చేసిన భారవి, శ్రీవేంకటేశ్వరుని భక్తుడైన ‘అన్నమయ్య’ కథకు రచన చేయడం విశేషం! ఇందులో అనువైన చోట అన్నమయ్య సంకీర్తనలను ఉపయోగించుకున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. “తెలుగు పదానికి జన్మదినం…”, “ఏలే ఏలే మరదలా…”, “అస్మదీయ తకధిమి…” వంటి పాటలను వేటూరి పలికించగా, “పదహారు కళలకు…” అనే పాటను భారవి రాశారు. మిగిలిన “కలగంటి కలగంటి…”, “అదివో అల్లదివో…”, “వినరో భాగ్యము…”, “విన్నపాలు వినవలె…”, “పొడగంటిమయ్యా మిము పురుషోత్తమా…”, “కొండలలో నెలకొన్న…”, “ఏమొకో… “, “జగడపు చనవుల జాజర…”, “పాలనేత్రాల…”, “నిగమ నిగమాంత…”, “నానాటికి బతుకు నాటకం…”, “దాచుకో తగ నీ పాదాలకు నే చేసిన పూజలివి…”, “అంతర్యామి అలసితి సొలసితి…” వంటి అన్నమయ్య కీర్తనలు వీనులవిందు చేస్తాయి.
‘అన్నమయ్య’ మొదటి వారం అంతగా జనాన్ని ఆకర్షించలేదు. తరువాత నుంచీ విపరీతంగా ఆదరణ చూరగొంది. ఈ చిత్రం దాదాపు 40 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. రెండే కేంద్రాలలో రజతోత్సవం ప్రదర్శితమయింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది. ఉత్తమ దర్శకుడుగా కె.రాఘవేంద్రరావు, ఉత్తమనటుడుగా నాగార్జున, ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎస్పీ బాలు, , ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా తోట బాబూరావు, , ఉత్తమ మేకప్ మేన్ గా టి.మల్లికార్జునరావు, ఉత్తమ కళాదర్శకుడు భాస్కరరాజు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ ఎ.విన్సెంట్ కూడా నంది అవార్డులు అందుకున్నారు. ఈ చిత్రానికి మరిన్ని అవార్డులూ రివార్డులూ లభించాయి. ఈ సినిమా తమిళ, మళయాళ భాషల్లో ‘అన్నమాచార్య’గా అనువాదమై అలరించింది. హిందీలోనూ ‘తిరుపతి శ్రీబాలాజీ’గా డబ్ అయి మురిపించింది. సినిమా రూపొందక మునుపు ఎందరిలోనో పలు అనుమానాలు రేకెత్తించిన ‘అన్నమయ్య’ చిత్రం విడుదలై విజయఢంకా మోగించడం విశేషం! ఈ సినిమా అందించిన ఉత్సాహంతోనే తరువాత నాగార్జున, సుమన్, కె.రాఘవేంద్రరావు కాంబోలో ‘శ్రీరామదాసు’ రూపొంది, ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది.