బాలతారలుగా భళా అనిపించి, నాయికలుగానూ మెప్పించిన వారున్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు తులసి. పిన్నవయసులోనే కెమెరా ముందు అదురూ బెదురూ లేకుండా నించుని డైరెక్టర్స్ చెప్పినట్టుగా చేసేసి మురిపించిన తులసి, తరువాత నాయికగానూ కొన్ని చిత్రాల్లో మెరిశారు. ప్రస్తుతం అమ్మ పాత్రల్లో అలరిస్తున్నారు.
తులసి 1967 జూన్ 20న మద్రాసులో జన్మించారు. చిన్నప్పటి నుంచీ ఎంతో చురుగ్గా ఉండేది తులసి. ఆమె తల్లికి అంజలీదేవి, సావిత్రి మంచి స్నేహితులు. ‘భార్య’ అనే సినిమాలో ఓ పసిపాప కావలసి వస్తే, తులసిని తీసుకు వెళ్ళారు. కొన్ని నెలల వయసులోనే తులసి తెరపై కనిపించింది. తరువాత అనేక చిత్రాలలో చిన్నపిల్లల గుంపులోనూ పాలు పంచుకుంది. దాసరి నారాయణరావు తులసి చెలాకీతనం చూసి తన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’లో బాలనటిగా నటింప చేశారు. తరువాత కె.విశ్వనాథ్ తన ‘సీతామాలక్ష్మి’లో కీలక పాత్రనిచ్చారు. అందులో “ఏ పాట నే పాడనూ…” పాటను తులసిపైనే చిత్రీకరించడం విశేషం! అందులో మంచి మార్కులు సంపాదించుకున్న తులసికి విశ్వనాథ్ తన ‘శంకరాభరణం’లో మరింత కీలకమైన పాత్రను అందించారు. ఈ రెండు సినిమాలు ఆమెకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డులు సంపాదించి పెట్టాయి. పట్టుమని పన్నెండేళ్ళ వయసు నిండకున్నా బరువైన పాత్రల్లో తగిన అభినయం ప్రదర్శించారు తులసి. జంధ్యాల ‘నాలుగు స్తంభాలాట’లోనూ తులసి మంచి పాత్రలో కనిపించింది. ‘శుభలేఖ’లో సుధాకర్ కు జోడీగా నటించి మంచి మార్కులు సంపాదించిన తులసికి బాపు తన ‘మంత్రిగారి వియ్యంకుడు’లోనూ తగిన పాత్రను ఇచ్చారు. ఇలా పలువురు దర్శకుల ప్రోత్సాహంతో తులసి అనతికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించారు.
బాలకృష్ణ సోలో హీరోగా మొదలైన తొలి చిత్రం ‘డిస్కోకింగ్’లో తులసిని నాయికగా ఎంచుకున్నారు. అందులో తులసి తన పాత్రకు తగ్గ న్యాయం చేశారు. అయితే సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తులసి తరువాత సైడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగానే సాగుతున్నారామె. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ తులసి తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తున్నారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ లో అలరించిన తులసి, ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్’లో నటిస్తున్నారు. ఇకపై కూడా తులసి మరిన్ని మంచి పాత్రల్లో అలరిస్తారని ఆశిద్దాం.