నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. పద్మజ ప్రముఖ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి. అలాగే నటుడు, ‘బ్రీత్’ ఫేమ్ చైతన్య కృష్ణ తల్లి. ఆమె మరణం నందమూరి కుటుంబానికే కాకుండా దగ్గుబాటి కుటుంబానికి కూడా తీరని లోటు గా మారింది. ఈ వార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కి బయలుదేరారు.
Also Read : Parashurama : ‘మహావతార్ పరశురామ’ పై సాలిడ్ అప్డేట్!
అలాగే సోషల్ మీడియాలో ‘బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. పద్మజ ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అని తెలిపారు. ఇక దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ నుంచి రానున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. నందమూరి కుటుంబానికి అత్యంత సమీపంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. పద్మజ మృతి నందమూరి కుటుంబానికి ఒక తిరుగులేని లోటు అని అందరూ భావిస్తున్నారు.