కరోనా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమ సాధారణ స్థితికి చేరుకోవడమే కాదు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుతో చకాచకా ముందుకు సాగిపోతోంది. మన సినిమాకు ఇప్పుడు జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఒక్కసారిగా కార్మికుల సమ్మెతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మరి తెలుగు సినిమా ఎదుగదలలో తాము ఉన్నామని చాటిన సినీ కార్మికులు వేతనాల పెంపు కారణంతో సమ్మె చేయటానికి కారణాలు
ఏమిటో తెలుసుకుందాం…
తెలుగు చిత్రపరిశ్రమకు సుప్రీం బాడీ ఫిలిమ్ ఛాంబర్. అలాగే సినీ కార్మికుల పెద్దన్న ఫిలిమ్ ఫెడరేషన్. ఇందులో సినిమాకు సంబంధించి 24న శాఖల యూనియన్స్, ఆ యూనియన్ల సభ్యులు భాగంగా ఉంటూ వస్తున్నారు. కార్మికుల సమస్యలు, వాటి పరిష్కారం, వేతనాల పర్యవేక్షణ వంటివి ఫెడరేషన్ ద్వారా జరుగుతూ వస్తోంది. దానికి అనుగుణంగా ఫెడరేషన్ ఎప్పటికప్పుడు ఫిలిమ్ ఛాంబర్ పెద్దలతో మాట్లాడుతూ ఉభయకుశలోపరిగా వ్యవహరిస్తూ
సామరస్యపూర్వకంగా, చాకచక్యంగా ముందుకు వెళుతూ ఉంది.
అయితే కరోనాదో కుదేలయిన చిత్రపరిశ్రమ కార్మికుల వేతనాల పెంపు విషయంలో జాప్యం వహించింది. 2021లోనే వేతన సవరణ జరగవసి ఉండగా దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. అర్థం చేసుకున్న కార్మికులు, ఫెడరేషన్ కూడా సర్దుకుపోయింది. ఇలా పలు ధపాలుగా వాయిదాలు పడుతుండటంతో ఈ నెల 6వ తేదీన ఛాంబర్ కు సీరియస్ గా లేఖ రాసింది ఫెడరేషన్. దాని ప్రకరాం 15 రోజుల్లో తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఫెడరేషన్ లోని యూనియన్లు తీసుకునే చర్యలకు కట్టబడి ఉండవలసి వస్తుందని పక్కాగా స్పష్టం చేసింది.
అయితే మంగళవారం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లిరామకృష్ణ తమకు ఎలాంటి నోటీస్ అందలేదని చెప్పటం గమనార్హం. ఇక ఛాంబర్ తో పాటు నిర్మాతల మండలి కూడా ఫెడరేషన్ లోని యూనియన్లు ఫెడరేషన్ మాటను వినటం లేదని, తమకు ఈ విషయంలో అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నాయి. ఇదే విషయమై ఫెడరేషన్ అధ్యక్షుడి వాదన మరోలా ఉంది. తమ ఫెడరేషన్ లోని ఫైటర్ అసోసియేషన్ విషయంలోనూ, డాన్సర్స్ అసోయసియేషన్ విషయంలో, సౌండ్ ఇంజనీర్ పప్పు విషయంలో తాము సానుకూల ధోరణితోనే ఉన్నామని, అయినా తాము వేతన సవరణ కోరినప్పుడల్లా ఇదే విషయాలను ప్రస్తావిస్తూ రావటం బాగాలేదని అంటున్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ కోరుతున్న వేతన సవరణ ఏమిటో ఓ సారి పరిశీలిద్దాం… నిజానికి ఈ 24 క్రాప్ట్స్ లో బాగా ఇబ్బంది పడుతున్నది దినసరి వేతన సినీ కార్మికులే… వారి ప్రస్తుత శాలరీ ఎంత… డిమాండ్ ఏమిటో ఓ లుక్కేద్దాం…
క్లీనర్, ప్రొడక్షన్ బాయ్స్ దినసరి వేతనం
(అల్పాహారం+ భోజనం + కన్వీనెన్స్ = రూ.1145
ప్రస్తుతం ఆశిస్తున్నది (30% హైక్) = రూ.1488
ఆదివారాలు, సెలవు దినాల్లో ప్రస్తుతం = రూ. 2290
పెంపుదల అంచనా = రూ. 2977
రోజుకు ప్రస్తుతం డ్రైవర్ల వేతనం = రూ.1055
ఆశిస్తున్న పెరుగుదల అంచనా = రూ.1362
ఆదివారాలు, సెలవు దినాలలో = రూ. 2110
పెంపు అంచనా = రూ.2743
ప్రస్తుతం రోజుకు లైట్ మ్యాన్ వేతనం = రూ.1100
పెరుదల అంచనా = రూ.1440
ఆదివారాలు, సెలవు దినాలలో = రూ.2200
పెరుగుదలపై అంచనా = రూ.2860
ఫైటర్స్ కి ప్రస్తుతం దినసరి వేతనం = రూ.3265
పెరుగుదల అంచనా = రూ.4244
డ్యాన్సర్లకు ప్రస్తుతం దినసరి వేతనం = రూ. 2800
పెరుగుదల అంచనా = రూ. 3640
వీరు కాకుండా సెట్ బోయ్స్, ఆర్ట్ అసిస్టెంట్స్ వంటి వారు కూడా తక్కువ వేతనంతో ఇబ్బంది పడుతున్నారు. వీరందరూ తమ వేతనాల పెంపుదల కోసం ఫిల్మ్ ఫెడరేషన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. అవసరం అయితే సమ్మెకు వెనకాడబోమంటున్నారు. వీరిలో చాలా మందిని నెలకు 15 రోజులు పని దొరికితే చాలనుకునే వారు ఉన్నారు. సినిమాల నిర్మాణం ఇబ్బడి ముబ్బడిగా పెరిగినా అవుట్ డోర్స్ వల్లో ఇతర కారణాలవల్లో ఫెడరేషన్ లోని యూనియన్లలో ఉండేవారికి సరైన విధంగా పని దొరకటం లేదన్నది వాస్తవం. మరి ఈ నేపథ్యంలో వచ్చిన ఈ సమ్మె ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. దీనికి పరిష్కారం దొరుకుతుందా? సమ్మె వల్ల టాప్ టు బాటమ్ పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకూ షూటింగ్ లు ఆగి నష్టపోవలసిన పరిస్థితి. ఈ నష్టం నిర్మాతల ఖాతాలోకే వెళుతుంది కానీ స్టార్స్, స్టార్ డైరెక్టర్ల కి ఎటువంటి నష్టం ఉండదని అర్థం చేసుకుని ఇండస్ట్రీ పెద్దలు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తారని ఆశిద్దాం.