ఒకప్పుడు ఉత్తరాన ఉరిమితే, దక్షిణాన తడుస్తుంది అనే సామెత హిందీ చిత్రసీమలో భలేగా హల్ చల్ చేసింది. ఎందుకంటే అప్పట్లో హిందీలో విజయవంతమైన చిత్రాలను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసి విజయాలు సాధించేవారు. పైగా హిందీ సినిమాయే భారతీయ సినిమా అనే కలర్ తీసుకు వచ్చి, దానినే అంతర్జాతీయంగా పరిచయం చేస్తూ పోయారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రాంతీయ చిత్రాలు సైతం అంతర్జాతీయ మార్కెట్ లో తమ సత్తా చాటుకుంటున్న రోజులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు సైతం బాలీవుడ్ ను భయపెట్టే రోజులు వచ్చాయా అన్న ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకంటే అక్కడి నిజాయితీ ట్రేడ్ పండిట్స్ సైతం మన ‘బాహుబలి-2’ను నంబర్ వన్ స్థానంలో నిలిపి, తరువాతి స్థానంలో ‘కేజీఎఫ్-2’ను, ఆపైనే మూడో స్థానంలో ‘దంగల్’ను కూర్చోబెట్టారు. ఇక మిగిలిన ట్రేడ్ పండిట్స్ ఇప్పటికీ ‘దంగల్’ నంబర్ వన్ అంటూ జబ్బలు చరుస్తున్నారు. అలాంటి వారు రంకెలు వేసి, అంకెల గారడీ ఎంత చేసినా సౌత్ సినిమాలదే పైచేయి అని అసలు లెక్కలు చెబుతున్నాయి. దాంతో బాలీవుడ్ బాబులు కొత్త పదాలు ఉపయోగిస్తూ తమ వసూళ్ళను చెప్పుకోవలసి వస్తోంది. తాజాగా ‘ఒరిజినల్ హిందీ మూవీస్’ అనే మాటను ఉపయోగిస్తూ తమ వసూళ్లను ప్రకటించుకున్నారు. వీటిలో నంబర్ స్థానాన్ని అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’కి, తరువాతి స్థానాన్ని ‘భూల్ భులయ్యా-2’కు ఇచ్చారు. అందులో ‘సూర్యవంశీ’ మొదటి రోజున రూ.26 కోట్లు పోగేసినట్టు ప్రకటించుకున్నారు. ‘భూల్ భులయ్యా-2’ రూ.13.75 కోట్లు సంపాదించినట్టు తెలిపారు. దీనిని బట్టే, దేశవ్యాప్తంగా విడుదలై ఒకప్పుడు రాజభోగం చూసిన హిందీ సినిమా ఎంతలా కుదేలయి పోయిందో ఇట్టే అర్థమై పోతోంది.
కేవలం ‘బాహుబలి-2’ హిందీ వర్షన్ మొదటి రోజున రూ.41 కోట్లు పోగేసింది. తరువాత ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ మొదటి రోజున రూ.51 కోట్లు చూసింది. ఈ లెక్కలు చూసి తలకిందులైన బాలీవుడ్ బ్రదర్స్ కొందరు ఈ డబ్బింగ్ సినిమాల ముందు తమ చిత్రాలు తేలిపోతాయని భావించారు. అందుకే ‘ఒరిజినల్ హిందీ మూవీస్’ అనే కొత్త పదాన్ని తీసుకువచ్చి, తమ చిత్రాల వసూళ్ల వివరాలు ప్రకటించుకుంటున్నారు.
అప్పట్లోనూ సౌత్ మూవీస్ “లవకుశ, ఉలగమ్ సుట్రుమ్ వాలిబన్, అడవిరాముడు” వంటి సినిమాలు హిందీ చిత్రాలకు దీటుగా వసూళ్ళు రాబట్టాయి. యావద్భారతదేశమంతా కలిపి అప్పటి టాప్ హిందీ హిట్స్ వసూలు చేసిన మొత్తాలను ఈ చిత్రాలు కేవలం దక్షిణాదిలో ఒకటి రెండు రాష్ట్రాల నుంచే పోగేయడం విశేషంగా ముచ్చటించుకొన్నారు. ఆ తరువాత సౌత్ సినిమాలే హిందీలోకి అనువాదమవుతూ అక్కడి వారినీ రంజింప చేయడం మొదలయింది. రజనీకాంత్ చిత్రాలు కొన్ని ఆ తీరున విజయం సాధించగా, ‘బాహుబలి’ సిరీస్ తో హిందీలోకి సౌత్ మూవీస్ అనువాదం కావడం అన్నది ఊపందుకుంది. ఇప్పుడు కన్నడ సినిమా ‘కేజీఎఫ్-2’ సైతం బాలీవుడ్ బెదిరిపోయేలా చేయడంతో హిందీ సినిమా జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మళ్ళీ హిందీ సినిమాకు పూర్వవైభవాన్ని ఏ సినిమాలు తీసుకు వస్తాయో చూడాలి.
