October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!

Tollywood

Tollywood

దసరా సెలవులు కలిసివచ్చినా అక్టోబర్ రిజల్ట్ అంతంత మాత్రమేనా? ఈ హాలిడేస్ డబ్బింగ్ మూవీకి ఎక్కువ కలిసి వచ్చాయా? దసరాను మిస్ చేసుకొని లాస్ అయిన సినిమా ఏంటి? ఇంతకీ అక్టోబర్ రిజల్ట్ ఏంటి? అక్టోబర్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. తెలుగులో అదిరిపోయే హిట్ లేదు. శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ థియేట్రికల్ రైట్స్‌ను ఆరు కోట్లకే అమ్మడంతో కవర్ చేయడం ఈజీ అయింది. లేదంటే నిర్మాతలు నష్టాలు చూసేవారు. బాలీవుడ్‌లో దాదాపు 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు ఆడియన్స్‌కు నచ్చలేదు. రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత తెలుగులో డబ్ కావడంతో ఆల్రెడీ చాలామంది హిందీ వెర్షన్ చూసేశారు. సెకండ్ హాఫ్ స్లోగా ఉండడం మైనస్ అయింది.

దసరా హాలిడేస్ ‘జైలర్ 2’కు కలిసి వచ్చాయి. ‘జైలర్’ 12 కోట్లకు అమ్మితే 48 కోట్ల షేర్ వచ్చింది. ‘జైలర్ 2’ దగ్గరికి వచ్చేసరికి థియేట్రికల్ బిజినెస్ 42 కోట్లకు చేరింది. ఇంత మొత్తం వస్తుందా అన్న భయం లేకపోలేదు. హిట్ టాక్ రావడం, అందులోనూ దసరా హాలిడేస్ కలిసివచ్చి 50 కోట్లకు పైగా షేర్ దాటేసింది. పండుగ సెలవులు ‘రణబలి’కి బాగా ఉపయోగపడ్డాయి. రిలీజ్‌కి ముందు నుంచి ట్రోల్ అవుతున్న ‘రణబలి’కి డివైడ్ టాక్ వచ్చింది. అయితే దసరా సెలవుల్లో ‘జైలర్ 2’ తప్ప మరో మూవీ లేకపోవడం ‘రణబలి’కి ప్లస్ అయి చాలా వరకు పెట్టుబడిని కవర్ చేసింది.

తొమ్మిదిన రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ 30న రిలీజ్ అయింది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ హిట్స్‌కు కథ, మాటలు రాసిన త్రివిక్రమ్ ఫస్ట్ టైం వెంకటేష్‌ను డైరెక్ట్ చేయడంతో హైప్ ఒక రేంజ్‌లో ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. అయితే అదేమీ కనిపించలేదు. ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌పై పడింది. ‘ఆదర్శ కుటుంబం’ యావరేజ్ టాక్ వచ్చినా స్టార్ హీరో రేంజ్‌లో ఓపెనింగ్స్ కనిపించలేదు. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ కలెక్షన్స్ సరిపోవు. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన మొదటి రోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ ఎక్కువ రావడం కాస్త ఊరటనిచ్చింది. దసరా మిస్ అయిన ఎఫెక్ట్ కలెక్షన్స్‌లో కనిపించింది. లేదంటే ఇదే టాక్ వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేది.

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘కల్ట్’ నిరాశనే మిగిల్చింది. మితిమీరిన హింస ఆడియన్స్‌ను భయపెట్టింది. కథ కొత్తగా ఉన్నా, కథనంతో విసిగించాడు దర్శకుడు. ‘గరివిడి లక్ష్మి’ ఉత్తరాంధ్రకు చెందిన కథ కావడంతో అక్కడి ఆడియన్స్ ఓన్ చేసుకొని ‘జైలర్ 2’ కంటే ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చారు. అక్కడి వసూళ్లతో సినిమా ఓవరాల్‌గా లాభాల బాట పట్టింది. హారర్ మూవీ ‘418’ మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చినా నిలబడలేకపోయింది.