ప్రతిభ ఉండాలే కానీ, చిత్రసీమ ఏదో ఒకరోజున పట్టం కట్టకుండా మానదు అన్నది నానుడి. ఆ మాటను నమ్మి ఎందరో చిత్రసీమలో రాణించాలని కలలు కంటూ అడుగు వేస్తుంటారు. స్పేస్ ఫిజిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ కు కూడా సినిమా రంగంలో వెలిగిపోవాలనే ఆశ ఉండేది. ఆయన ఆశయం దర్శకుడు కావాలన్నది. అయితే చిత్రసీమ చిత్రవిచిత్రాలకు వేదిక. ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్ కావాలని అడుగులు వేసినా, అంతకు ముందు నేర్చుకున్న సంగీతం అతనికి ఆదరువు అయింది. ముందు సంగీత దర్శకునిగా జైత్రయాత్ర చేశాకే దర్శకుడయ్యారు ఆర్పీ. నటనలోనూ తనదైన బాణీ పలికించారు. ఇప్పుడయితే ఎప్పుడో ఒకప్పుడు ఆర్పీ పట్నాయక్ స్వరాలు వినిపిస్తున్నాయి కానీ, ఆరంభంలో యువతను ఉర్రూతలూగించే సంగీతం అందించారు ఆర్పీ. గాయకునిగానూ మురిపించారు ఆర్పీ. కొంతకాలంగా ఆయన సరిగమలు సందడి చేయడం లేదు, పదనిసల ప్రయాణంలో నిదానం చోటు చేసుకుంది.
ఒరిస్సాలో 1970 మార్చి 10న జన్మించిన ఆర్పీ పట్నాయక్ మాతృభాష తెలుగు. ఆయన తండ్రి ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉండేవారు. ఆంధ్రాయూనివర్సిటీ నుండి స్పేస్ ఫిజిక్స్ లో పీజీ చేశాక, ఆర్పీ మనసు చెప్పినట్టుగా వింటూ సినిమా రంగంలో అడుగుపెట్టారు. 1999లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీ కోసం’ చిత్రంతో ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. అతని బాణీల్లోని వైవిధ్యం ఆకర్షించడంతో సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ తేజ తన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘చిత్రం’కు ఆర్పీతో బాణీలు కట్టించారు. ఆ సినిమా ఘనవిజయంతో తేజ, ఆర్పీ పట్నాయక్ జోడీ యువతను అలరిస్తూ ముందుకు సాగింది. తేజ దర్శకత్వంలో రూపొందిన ‘నువ్వు-నేను’ చిత్రం ద్వారా ఆర్పీ పట్నాయక్ కు ఉత్తమ సంగీత దర్శకునిగా రాష్ట్రప్రభుత్వ నంది అవార్డుతో పాటు, పాపులర్ ఫిలిమ్ ఫేర్ అవార్డు కూడా లభించింది. ‘సంతోషం’తోనూ ఉత్తమ సంగీత దర్శకునిగా ఆర్పీ పట్నాయక్ ఫిలిమ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. కన్నడ చిత్రం ‘ఎక్స్ క్యూజ్ మీ’ ద్వారా మరో ఫిలిమ్ ఫేర్ అవార్డు ఆర్పీకి దక్కింది. ఇలా ఉత్తమ సంగీత దర్శకునిగా తన సత్తా చాటుకుంటూనే మాస్ ను విశేషంగా ఆకట్టుకొనే బాణీలతోనూ సందడి చేశారు ఆర్పీ.
గాయకునిగానూ ఆర్పీ పట్నాయక్ తన గళవిన్యాసాలతో అలరించారు. ‘నీ కోసం’లోని “నీ కోసం…”, ‘జయం’లోని “ప్రియతమా…తెలుసునా…”, ‘నువ్వు-నేను’లోని “గాజువాక పిల్లా…”, ‘ఫ్యామిలీ సర్కస్’లోని “తిట్టకురో కొట్టకురో…”, ‘మనసంతా నువ్వే’లోని “చెప్పవే ప్రేమా…”, ‘ఈశ్వర్’లోని “అమీర్ పేటకు ధూల్ పేటకు…” , ‘దిల్’లోని “గాజులు గల్లు మన్నయే…”, ‘నిజం’లోని “చందమామ రావే…” వంటి ఆర్పీ గానం చేసిన పాటలు జనాన్ని అలరించాయి.
ఆర్పీ పట్నాయక్ లైవ్ షోస్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. వైజాగ్ లో 2002 జూలై 20న సముద్ర తీరాన ఏర్పాటు చేసిన ఆర్పీ పట్నాయక్ సంగీతవిభావరి చరిత్ర సృష్టించింది. అప్పట్లో ఆరు లక్షలమంది ఆ సంగీత విభావరిని చూసి ఆనందించారు. అంతటి ప్రజాదరణ నడుమ మళ్ళీ అలాంటి పాటల సందడి జరగలేదు. దేశవిదేశాల్లో మ్యూజికల్ నైట్స్ తో అలరించిన పట్నాయక్ మనసు మెల్లగా నటనపైకి మళ్ళింది. 2004లో ‘శీను వాసంతి లక్ష్మి’ చిత్రంతో నటునిగా తెరపై కనిపించారు. అందులో ప్రధాన పాత్ర పోషించిన ఆర్పీ పట్నాయక్ ఆ తరువాత “అందమైన మనసులో, బ్రోకర్, తులసిదళం, మనలో ఒక్కడు” వంటి చిత్రాల్లో నటించారు.
దర్శకుడు కావాలనే చిత్రసీమలో ప్రవేశించిన ఆర్పీ పట్నాయక్ 2008లో ‘అందమైన మనసులో’ చిత్రంతో తన అభిలాష తీర్చుకున్నారు. ఆ తరువాత “బ్రోకర్, ఫ్రెండ్స్ బుక్, అమి, తులసీదళం, మనలో ఒక్కడు”వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. సంగీత దర్శకునిగా ఒకే ఒక నందిని సొంతం చేసుకున్న ఆర్పీ, “అందమైన మనసులో, బ్రోకర్” చిత్రాలకు కథారచయితగా నంది అవార్డును అందుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు సైతం ఆర్పీ పట్నాయక్ సంగీతం సమకూర్చారు. సదరు చిత్రాలు కూడా ఆర్పీ బాణీలతో భలేగా సందడి చేశాయి. కన్నడ నాట ఆర్పీ పట్నాయక్ సంగీతానికి విశేషమైన క్రేజ్ లభించింది. ఒకానొక దశలో తెలుగు చిత్రాలకంటే కన్నడ చిత్రాలకే ఆర్పీ బాణీలు ఎక్కువగా కట్టారు. ఏది ఏమైనా ఆర్పీ పట్నాయక్ మళ్ళీ సంగీతం సమకూర్చాలని ఎంతోమంది ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తూ ఆర్పీ పట్నాయక్ మళ్ళీ పదనిసలు పలికిస్తూ సరిగమలతో సంబరాలు చేస్తారేమో చూద్దాం.