టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై మరింత లోతుగా విచారణ చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాల కింద అవసరమైతే ఇంటర్పోల్ మద్దతు తీసుకునే ఆలోచనలో ఈడి ఉన్నట్లుగా సమాచారం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డ్రక్స్ కొనుగోలుపై పునాదులు తవ్వుతోంది ఈడి. ఏ దేశానికి ఎంత మొత్తంలో నిధులు మళ్ళించారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని 12 మంది సినీ తారలకు ఈడి నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వీరిచ్చే సమాచారాన్ని బట్టి మరికొందరిని ప్రశ్నించాలని ఈడి అధికారులు భావిస్తున్నారు.
సిట్ జరిపిన దర్యాప్తులో డ్రగ్ మాఫియా కు టాలీవుడ్ ప్రముఖులకు సంబంధాలున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇదే విషయాన్ని ఎక్సైజ్ శాఖ, సిట్ ఛార్జీషీట్ లో పేర్కొన్నాయి. విదేశాల నుండి డ్రగ్స్ దిగుమతి అయినట్లు మాత్రం ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. డ్రగ్స్ దిగుమతికి సంబంధించిన చెల్లింపుల మూలాలను త్వరలోనే బయటికి తీయనున్న ఈడి.
Read Also : “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” రాకకు ముహూర్తం ఖరారు
అమెరికా, ఆస్ట్రియ, దక్షిణాఫ్రికా దేశాల నుండి కొరియర్ ల ద్వారా డ్రగ్స్ దిగుమతి చేసుకున్నారు. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న డ్రగ్ మాఫియా ఖాతాల్లోకి ఇక్కడ నుండి నగదు బదిలీ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు కోసం జరిగిన లావాదేవీల గురించి ఈడి ఆరా తీయబోతోంది. ఎవరెవరు ఖాతా నుండి ఎంత చెల్లించారనే విషయాలు సేకరించబోతున్నారు. విదేశాల్లో ఉన్న ఎవరి ఖాతాల్లోకి ఎంత మళ్ళించారనే విషయంపై ఇంటర్పోల్ సహాయం అవసరమని ఈడి భావిస్తోంది. ఇంటర్పోల్ ద్వారా అక్కడి బ్యాంక్ అధికారుల నుండి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది.