NTV Telugu Site icon

Reunion: నాటి బాల తారల సంగమం… అదిరిందిగా!!

Child

Child

Child Artist Reunion: ఎయిటీస్ నాటి హీరోలు, హీరోయిన్లు ఇప్పటికీ తరచూ కలుస్తుంటారు. హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరులో ప్రతి యేడాది సరదాగా పార్టీ చేసుకుంటారు. సౌతిండియన్ స్టార్స్ అంతా కలిసి ఈ సమయంలో చేసే సందడి అంతా ఇంతా కాదు! విశేషం ఏమంటే… అలాంటి మరో రేర్ రీ-యూనియన్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. అదే నాటి బాల తారల సంగమం! ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజారమణి బాలనటి అనే విషయం తెలిసిందే. ఆమె తనయుడు తరుణ్ సైతం బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డును అందుకున్నాడు. గతంలో చెన్నయ్ లో బాల తారల సంగమాన్ని నిర్వహించిన రోజారమణి… హైదరాబాద్ లోనూ అలాంటి కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. ఆమె నేతృత్వంలో తొలి తెలుగు బాలతారల సంగమం గత ఆదివారం హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ లో జరిగింది. ‘లవకుశ’ చిత్రంలో కుశుడిగా నటించిన సుబ్రహ్మణ్యంతో పాటు అలనాటి బాల తారలు దాదాపు 30 మంది ఈ రీ-యూనియన్ లో పాల్గొన్నారు.

చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించినంత మాత్రాన పెద్దయ్యాక చిత్రసీమలో నిలదొక్కుకోవాలని ఏం లేదు. కొందరు నటన మీద అభిలాషతో చదువు పూర్తి చేసి సినిమాల్లో కొనసాగుతూ ఉంటారు. మరికొందరు వేరే వ్యాపకాల్లో పడి… నటనకు దూరమౌతారు. అయితే బాల నటులుగా రాణించిన కొందరు ఆ తర్వాత హీరోలుగానూ తమ అదృష్టం పరీక్షించుకున్నారు. మాదాల రంగారావు తనయుడు రవి కొన్ని సినిమాలలో హీరోగా చేశాడు. తనీశ్ బాలనటుడిగానే కాదు… హీరోగానూ నటించి మెప్పించాడు. ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు అందుకున్న కౌశిక్ బాబు సైతం హీరోగా నటించాడు. మరీ ముఖ్యంగా మలయాళంలో అయప్పస్వామి పాత్ర చేసి మెప్పించాడు. అలీ తమ్ముడు ఖయ్యూమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. బాల నటులు, అన్నదమ్ములు కౌశిక్ శ్రీకృష్ణ, బాలాదిత్య నటులుగా కొనసాగుతున్నారు. బాలాదిత్య హీరోగా నటిస్తే… కౌశిక్ శ్రీకృష్ణ బుల్లితెర నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే ఉత్తేజ్ కుమార్తె చేతన ఒకటి రెండు సినిమాల్లో నాయికగా నటించి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంది. ఈ బాల తారల సంగమంలో కాంతారావు తనయుడు రాజారావ్, ఆనంద వర్థన్, దిలీప్ కుమార్, సునయన, భావన, యాని తదితరులు పాల్గొన్నారు. తమ సినీ రంగ ప్రవేశం గురించి, తదనంతరం పరిణామాల గురించి వీరంత మనసు విప్పి మాట్లాడుకున్నారు. కార్యక్రమం చివరలో పాల్గొన్న అలీ మాట్లాడుతూ, ‘చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇలాంటి ఒక రీ-యూనియన్ ను తాను ఏర్పాటు చేయాలనుకున్నానని, ఈలోగా రోజారమణి గారు చొరవతీసుకుని ఈ కార్యక్రమం చేశారని, ఇకపై ప్రతి యేడాది కలిస్తే బాగుంటుంద’ని అన్నారు.