DMK Murali: రంగస్థలం నుండి చిత్రసీమలోకి అడుగుపెట్టిన డి.ఎం.కె. మురళీ అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. మచిలీపట్నంకు చెందిన మురళీకి యుక్త వయసు నుండి నాటకరంగంతో అనుబంధం ఉంది. పలు పౌరాణిక, సాంఘిక నాటకాలలో ఆయన నటించారు. దుర్యోధనుడి మయసభ ఏకపాత్రాభినయం ఆయనకు నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి సినిమా రంగంలో ప్రయత్నాలు చేశారు. పలు సంవత్సరాలు దర్శకత్వ శాఖలో పని చేసిన తర్వాత జర్నలిస్ట్ గా మారారు. ఓ ప్రముఖ వెబ్ ఛానెల్ లో ఆయన సినీ ప్రముఖులను కొన్నేళ్ళ పాటు ఇంటర్వ్యూలు చేశారు. అయితే నటన మీద మక్కువ ఉన్న డీఎంకే మురళీకి తొలిసారి వెండితెరపై కనిపించే అవకాశాన్ని మిత్రుడు, రచయిత లక్ష్మీ భూపాల ‘అందాల రాక్షసి’ చిత్రంతో కల్పించారు. ఆ తర్వాత మారుతీ దర్శకత్వం వహించిన ‘బస్ స్టాప్’ మూవీలో మురళీ కీలక పాత్ర పోషించారు. ‘తడాఖా, కొత్తజంట, కాయ్ రాజా కాయ్’ వంటి చిత్రాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితం అయిపోయారు. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో స్వగ్రామానికి వెళ్ళారు. అయితే ఆదివారం షూటింగ్ నిమిత్తం గుంటూరు వెళ్ళిన ఆయన అక్కడే తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూసినట్టు బంధువులు తెలిపారు. మురళీ మృతికి సినీరంగ ప్రముఖులతో పాటు, పాత్రికేయులూ తీవ్ర సంతాపాన్ని తెలిపి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.