నాటి మేటి నటులలో తన బహుముఖ ప్రజ్ఞతోనూ, బహు భాషాపాండిత్యంతోనూ ఆకట్టుకున్న అరుదైన నటులు కొంగర జగ్గయ్య. ఆయన పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన కంచుకంఠం. ఎంతటి సుదీర్ఘ సమాసాలనైనా అలవోకగా చెప్పగల నేర్పు, ఓర్పు జగ్గయ్య గళం సొంతం. చిత్రసీమలో అడుగు పెట్టకముందు తన విద్యను ప్రదర్శించుకోవడానికి అన్నట్టు జగ్గయ్య బహుకృత వేషం కట్టారు. అందులో పాత్రికేయ వృత్తిలోనూ రాణించారు. రేడియోలో వార్తలూ చదివారు. ఆ రోజుల్లో జగ్గయ్య వార్తలు చదువుతున్నారంటే ఆ నాటి పార్కుల్లో ఉన్న రేడియోల దగ్గరకు జనం గుమి కూడేవారు. ఇప్పటికీ ఆ ముచ్చట గురించి ఆ నాటి జనం చెప్పుకుంటారు. ఇక చిత్రసీమలో జగ్గయ్య తనదైన వాచకంతో అలరించిన తీరు జనాన్ని కట్టిపడేసింది.
కొంగర జగ్గయ్య 1926 డిసెంబర్ 31న తెనాలి సమీపంలోని మోరంపూడి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి కొంగర సీతారామయ్య, తల్లి రాజ్యలక్ష్మమ్మ. జగ్గయ్య కన్నవారికి సాహిత్యంలో మంచి ప్రవేశముండేది. సీతారామయ్యకు లలిత కళలంటే ఎంతో అభిమానం. ఇక జగ్గయ్య తల్లి పాటలు, పద్యాలు బాగా పాడేవారు. దాంతో జగ్గయ్యకు చిన్నతనంలోనే సంగీతసాహిత్యాల పట్ల అభిరుచి పెరిగింది. బాల్యంలోనే రామాయణ, భారత, భాగవత గాథలు చదువుకున్నారు. పదకొండేళ్ళ ప్రాయంలోనే ‘లవకుశ’ నాటకంలో లవునిగా నటించి మెప్పించారు. ప్రఖ్యాత చిత్రకారులు అడివి బాపిరాజు పర్యవేక్షణలో చిత్రలేఖనం కూడా అభ్యసించారు జగ్గయ్య. సాహిత్యంపై పట్టు సాధించారు. కవితలు రాసేవారు. నాటకాలూ రచించారు. ఆంధ్రక్రైస్తవ కళాశాలలో చదువుకొనే రోజుల్లో యన్టీఆర్ క్లాస్ మేట్ జగ్గయ్య. ఇద్దరూ కలసి పలు నాటకాలు వేసి అలరించారు. ఆకాశవాణిలో మూడు సంవత్సరాలు న్యూస్ రీడర్ గా పనిచేసిన జగ్గయ్యను మిత్రులు ప్రోత్సహించారు. దాంతో ఆయన మనసు సినిమా రంగంవైపు పరుగు తీసింది. త్రిపురనేని గోపీచంద్ తెరకెక్కించిన ‘ప్రియురాలు’ చిత్రంతో జగ్గయ్య సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఆరంభంలో జగ్గయ్యకు పరాజయాలు ఎదురయ్యాయి. బి.యన్.రెడ్డి రూపొందించిన ‘బంగారుపాప’తో జగ్గయ్యకు మంచి గుర్తింపు లభించింది. తరువాత ఏయన్నార్ హీరోగా రూపొందిన “అర్ధాంగి, దొంగరాముడు” చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు జగ్గయ్య. యన్టీఆర్ హీరోగా తెరకెక్కిన “ఇంటికి దీపం ఇల్లాలే, గుడిగంటలు” సైతం జగ్గయ్యకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో సైడ్ హీరోగా నటించిన జగ్గయ్య కె.బి.తిలక్ రూపొందించిన “ముద్దుబిడ్డ, ఉయ్యాల- జంపాల, ఎమ్.ఎల్.ఏ, చిట్టి తమ్ముడు, ఈడు-జోడు” చిత్రాలలో కథానాయకునిగా నటించారు. జగ్గయ్య హీరోగా నటించిన ‘ముందడుగు’ మంచి పేరు సంపాదించి పెట్టింది. అలాగే ఆయన నటించి, నిర్మించిన ‘పదండి ముందుకు’ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో చివరగా వినిపించే “మంచికి కాలం తీరిందా…” పాటను జగ్గయ్యనే స్వయంగా రాయడం విశేషం. కాగా, ఈ పాటను అప్పటి విఖ్యాత హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ ఆలపించారు. రఫీ పాడిన తొలి తెలుగు పాట ఇదే కావడం మరింత విశేషం. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రష్యాలోని తాస్కెంట్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది. మరికొన్ని చిత్రోత్సవాల్లోనూ ఈ సినిమా ప్రదర్శన సాగింది. తరువాతి రోజుల్లో ‘శభాష్ పాపన్న’ (1972) చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా కూడా ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. జగ్గయ్య కంచుకంఠం శివాజీగణేశన్, ఎమ్జీఆర్ వంటి పరభాషా నటులకు తెలుగులో ప్రాణం పోసింది. ముఖ్యంగా శివాజీ అభినయానికి జగ్గయ్య కంచుకంఠానికి జోడీ కుదిరి అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
జగ్గయ్యకు సాహిత్యం అంటే ఎంతో అభిమానం. ముఖ్యంగా ఆంగ్ల, బెంగాలీ సాహిత్యాలంటే ఆయనకు ప్రాణం. షేక్స్ పియర్ నాటకాలను భట్టీయం వేసి, అందులోని డైలాగ్స్ ఇట్టే అప్పచెప్పేవారు. ఇక నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ టాగూర్ అంటే ప్రత్యేక అభిమానం . రవీంద్రుడు రాసిన ‘గీతాంజలి’ని తెలుగుకు అనువదించారు జగ్గయ్య. ఆంగ్లంలో మంచి పట్టున్న జగ్గయ్య అనేక వేదికలపై అనర్గళంగా ఇంగ్లిష్ లో ఉపన్యసించిన సందర్భాలూ ఉన్నాయి.
రాజకీయాలంటే జగ్గయ్యకు చదువుకొనే రోజుల నుంచే ఆసక్తి. నాటి దేశభక్తుల ఉపన్యాసాలకు ఆకర్షితుడై నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన ‘పీపుల్స్ సోషలిస్ట్ పార్టీ’లోకి మారారు. 1956లో నాటి ప్రధాని జవహర్ లాల్ పిలుపు మేరకు మళ్ళీ జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరిన జగ్గయ్యకు 1962లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభకు పోటీ చేసే అవకాశం లభించింది. అప్పట్లో ఆచార్య ఎన్.జి.రంగా స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీలో ఉన్న కారణంగా సాక్షాత్తు నెహ్రూ , జగ్గయ్యను పోటీ నుండి తప్పుకోమని కోరారు. రంగా లాంటి విజ్ఞానవంతులు చట్టసభల్లో ఉండాలన్న అభిలాషతో నెహ్రూ తమ పార్టీకి చెందిన జగ్గయ్యను తప్పించడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు. 1967లో జగ్గయ్య ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 80వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. అలా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని విజయం సాధించిన తొలి నటుడుగా జగ్గయ్య చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో విశేష అనుభవం గడించిన తరువాత తన చివరి రోజుల్లో ‘రాజకీయ నిఘంటువు’ రాశారు. జగ్గయ్య బహుముఖ ప్రజ్ఞకు పద్మభూషణ్ అవార్డు లభించింది.
ఆ రోజుల్లో యన్టీఆర్, ఏయన్నార్ స్టార్ హీరోస్ గా రాణిస్తూండగా, వారి చిత్రాలలో జగ్గయ్య, కాంతారావు కీలక పాత్రల్లో కనిపించేవారు. జగ్గయ్య, కాంతారావు కలసి నటించిన ‘కానిస్టేబుల్ కూతురు’ మంచి ఆదరణ పొందింది. ఆ పై వారిద్దరూ అనేక సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. యన్టీఆర్ హీరోగా కృష్ణ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’లో జగ్గయ్య, కాంతారావు విలన్లుగా నటించడం విశేషం.
‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ పతాకంపై నిర్మితమైన తొలి చిత్రం ‘అన్నపూర్ణ’. ఇందులో జగ్గయ్య, జమున నాయకానాయికలుగా నటించారు. తరువాత జగపతి సంస్థ ఏయన్నార్ హీరోగా అనేక చిత్రాలు రూపొందించింది. అన్నిటా జగ్గయ్య కీలక పాత్రలు పోషించారు.
యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరి చిత్రాలలోనూ జగ్గయ్య కీలక పాత్రలు ధరించారు. వారి సొంత చిత్రాలలోనూ జగ్గయ్య ముఖ్యపాత్రలు పోషించి, మెప్పించారు.
జగ్గయ్య కాలేజీ రోజుల్లో యన్టీఆర్ ఆయనకు క్లాస్ మేట్. వయసులోపెద్దవాడైనా, మధ్యలో యన్టీఆర్ చదువుకు కొంత విరామం ఏర్పడింది. అందువల్ల తరువాతి రోజుల్లో జగ్గయ్య తో కలసి చదువుకున్నారు. యన్టీఆర్,జగ్గయ్య కలసి ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ‘ ఆరంభించారు. ఆ సంస్థ ద్వారా వారు పలు నాటకాలు ప్రదర్శించారు. రవీంద్రుని ‘శాక్రిపైస్’ నాటకాన్ని ‘బలిదానం’ పేరుతో అనువదించారు. ఆ నాటకాన్ని పలుమార్లు ప్రదర్శించారు యన్టీఆర్, జగ్గయ్య. చిత్రసీమలోనూ ఈ ఇద్దరు మిత్రుల అనుబంధం కొనసాగింది. అనేక యన్టీఆర్ సినిమాల్లో సైడ్ హీరోగా నటించారు జగ్గయ్య. ‘చిన్ననాటి స్నేహితులు’లో ఇద్దరూ మిత్రులుగా నటించడం అప్పట్లో విశేషంగా చెప్పుకున్నారు. ఇక యన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశిస్తున్న సమయంలో ఎంతోమంది ఆయనను విమర్శించారు. జగ్గయ్య తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, తన మిత్రుడు ఎన్టీఆర్ పై ఎంతో విశ్వాసముండేది. నిజానికి జగ్గయ్యకు తెలిసినంత రాజకీయ పరిజ్ఞానం యన్టీఆర్ కు అప్పట్లో లేదు. అయినా, యన్టీఆర్ రాజకీయాల్లో రాణిస్తారు అనే నమ్మకం జగ్గయ్యకు ఉండేది. 1983లో యన్టీఆర్ ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రి అయిన తరువాత ‘దీక్షాదక్షుడు మా సోదరుడు’ అంటూ జగ్గయ్య కితాబు నిచ్చారు.అనేక చిత్రాలలో యన్టీఆర్ కు అన్నగా నటించారు జగ్గయ్య. చిత్రమేమిటంటే యన్టీఆర్ తనయుడు బాలకృష్ణకు కూడా జగ్గయ్య ‘అల్లరి క్రిష్ణయ్య’లో అన్నగా నటించడం.