జాతీయ ఉత్తమ నటి విద్యాబాలన్ వీలైనంతవరకూ అర్థవంతమైన చిత్రాలలోనే నటిస్తుంటుంది. ఆమె తాజా చిత్రం ‘జల్సా’ కూడా అలాంటిదే. విద్యాబాలన్ తో పాటు షెఫాలీ షా కీలక పాత్ర పోషించిన ఈ థ్రిల్లర్ డ్రామాను సురేష్ త్రివేణి తెరకెక్కించారు. భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ తో కలిసి ఈ మూవీని విక్రమ్ మల్హోత్రా, శిఖాశర్మ, సురేష్ త్రివేణి నిర్మించారు. మానవ్ కౌల్, రోహిణీ హట్టంగడి, ఇక్బాల్ ఖాన్, విద్యార్థి బండి, శ్రీకాంత్ మోహన్ యాదవ్, షఫీన్ పటేల్, సూర్య కాశీభట్ల కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 18న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా విద్యాబాలన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ఈ మూవీలోని తన పాత్రకు సంబంధించిన పోస్టర్ ను పోస్ట్ చేస్తూ, ‘అసలు కథ ఆమె చిరునవ్వు వెనుక దాగిఉంది’ అని పేర్కొంది.
విక్రమ్ మల్హోత్రా, శిఖాశర్మతో తమ జర్నీ ఎంతో ఉత్సాహభరితంగా సాగుతోందని, తమ కాంబినేషన్ లో వచ్చిన ‘ఎయిర్ లిఫ్ట్, షేర్నీ, ఛోరీ’ చిత్రాల మాదిరిగానే ‘జల్సా’ సైతం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని భూషణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి గ్రిప్పింగ్ తో సాగే థ్రిల్లర్ డ్రామా ‘జల్సా’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని ఆయన అంటున్నారు.