Telugu Cinema: ఫిబ్రవరి మాసంలో గడిచిన మూడు వారాంతాలలోనూ ఐదు సినిమాలకు తక్కువ కాకుండా జనం ముందుకు వచ్చాయి. అయితే… ఈ వారం మాత్రం కేవలం మూడు చిత్రాలే విడుదల కాబోతున్నాయి. ఇంతవరకూ ఈ నెలలో 20 సినిమాలు విడుదల కాగా, ఇప్పుడు రెండు స్ట్రయిట్ మూవీస్ తో పాటు ఓ డబ్బింగ్ చిత్రం రిలీజ్ అవుతోంది.
విజయనిర్మల కుటుంబం నుండి మరో వారసుడు ‘మిస్టర్ కింగ్’ మూవీతో జనం ముందుకు వస్తున్నాడు. నరేశ్ కజిన్ అయిన రాజ్ కుమార్ తనయుడే శరణ్. సినిమాల మీద మక్కువ ఉన్న శరణ్ టాలీవుడ్ ఆడియెన్స్ ను టార్గెట్ చేశాడు. నిజానికి ‘మిస్టర్ కింగ్’తో పాటు మరో ఒకటి రెండు సినిమాలు కూడా అతను హీరోగా మొదలయ్యాయి. కానీ అవి పూర్తి కాలేదు. ‘మిస్టర్ కింగ్’ అతని తొలి చిత్రంగా విడుదల కాబోతోంది. శశిధర్ చావలి దర్శకత్వంలో బి.ఎన్. రావు నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ హీరోయిన్లుగా నటించారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరడం కోసం ఆదర్శ పథంలో సాగే యువకుడి కథగా ‘మిస్టర్ కింగ్’ తెరకెక్కింది.
ఈ వారం విడుదల కాబోతున్న మరో సినిమా ‘డెడ్ లైన్’. నటుడు, దర్శకుడు బి. వి. రమణారెడ్డి గతంలో కొన్ని సినిమాలను రూపొందించాడు. కాస్తంత విరామం తర్వాత ఇప్పుడీ సినిమాతో దర్శకుడిగా మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. పరుచూరి బ్రదర్స్ ప్రియ శిష్యుడైన రమణారెడ్డి ‘లాంగ్ లాంగ్ ఎగో’ అనే డైలాగ్ తో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అజయ్ ఘోష్, అపర్ణా మాలిక్, సోనియా, కౌశిక్, ఐశ్వర్య, గోపికర్, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ‘డెడ్ లైన్’ మూవీని తాండ్ర గోపాల్ నిర్మించారు. లైంగిక అత్యాచారాల నేపథ్యంలో బొమ్మారెడ్డి వి.ఆర్.ఆర్. తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ టీజర్ ను విజయశాంతి ఆవిష్కరించడం విశేషం.
ఈ శుక్రవారం జనం ముందుకు వస్తున్న అనువాద చిత్రం ‘కోనసీమ థగ్స్’. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద ఈ మూవీకి దర్శకత్వం వహించారు. గత యేడాది ఆమె ‘హే సినామిక’ మూవీ తీశారు. దర్శకురాలిగా ఇది రెండోది. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీతో హిద్రు హరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. సింహా, ఆర్.కె. సురేశ్, మునీష్ కాంత్, అనస్వర రంజన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తన మొదటి చిత్రం లానే దీనిని కూడా బృంద పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇంటెన్స్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతం అందించాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీన్ని విడుదల చేస్తోంది. మరి భిన్నమైన కథాంశాలతో వస్తున్న ఈ మూడు చిత్రాలలో దేనికి ప్రేక్షకులు పట్టం కడతారో చూడాలి.
