హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ .గోపాల్ రెడ్డి కలసి ‘మువ్వగోపాలుడు’తో హ్యాట్రిక్ సాధించారు. అంతకు ముందు ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ‘మంగమ్మగారి మనవడు’ 560 రోజులు, ‘ముద్దుల క్రిష్ణయ్య’ 365 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించాయి. వీరి కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘మువ్వగోపాలుడు’ సైతం 300 రోజులు ప్రదర్శితమయింది. ఇలా వరుసగా ముగ్గురు కలసి మూడు త్రిశతదినోత్సవాలు చూసిన ఘనత అప్పటి దాకా ఎవరికీ లేదు. ఆ తరువాత కూడా ఎవరూ చూడలేదు. 1987 జూన్ 19న ‘మువ్వగోపాలుడు’ చిత్రం జనం ముందు నిలచి, వారి మనసులు గెలిచింది.
ఈ చిత్ర కథ ఏమిటంటే – గోపాల కృష్ణ ప్రసాద్ అనే గోపి కోటీశ్వరుడైనా, పెత్తనమంతా అక్కమొగుడు, మేనమామ అయిన బసవరాజుదే. గోపికి అతని మాట వేదవాక్కు. అతను కూర్చో అంటే కూర్చుంటాడు, లే అంటే లేస్తాడు. అక్క నాగలక్ష్మిని చూసి గోపి ఏమీ అనలేడు. మామ చేసే అకృత్యాలను ఆపలేడు. ఈ పరిస్థితుల్లో ఆ ఊరికి డాక్టర్ గా వచ్చిన నిర్మలను ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. బసవరాజు ఆ పెళ్ళి జరిగితే ఆస్తి మీద పెత్తనం పోతుందని భావిస్తాడు. తన కూతురునిచ్చి గోపికి పెళ్ళి చేయాలనుకుంటాడు. హుటాహుటిని వాళ్ళ బామ్మ దగ్గర ఉన్న కూతురు కృష్ణవేణిని పిలిపిస్తాడు. ఆమె పెద్దమనిషి అయిందని, మేనమామ కాబట్టి అతని చేత దండవేయిస్తాడు బసవరాజు. ఆ దండలోనే ఓ మంగళసూత్రం ఎవరికీ కనిపించకుండా పెట్టి ఉంటాడు. అది మెడలో పడగానే, గోపికి, కృష్ణవేణికి పెళ్ళయిపోయిందని చెబుతాడు బసవరాజు. అతని తప్పులను ఆ ఊరిలో ఫాదర్ గా పనిచేసే లారెన్స్ ఎండగడతాడు. అతణ్ణి శిలువ వేసి చంపేస్తాడు బసవరాజు. మేనమామ మనసులో తాను లేనని తెలుసుకున్న కృష్ణవేణి, అతని బాగు కోసం నిర్మలతో పెళ్ళి చేయించాలనుకుంటుంది. అయితే నిర్మలను కూడా సజీవ దహనం చేయాలనుకుంటాడు బసవరాజు. ఆమె చర్చిలోకి వెళ్ళి తలదాచుకొని, సిస్టర్ గా మారుతుంది. తరువాత ఊరి జనమంతా బసవరాజును ఛీ కొడతారు. గోపి, మామ బసవరాజును హత్య చేసి జైలుకెళతాడు. జైలు నుండి భర్త తిరిగి వచ్చే రోజు అక్కడకు వెళ్తుంది కృష్ణవేణి. అక్కడికి వచ్చిన సిస్టర్ నిర్మల వారికి శుభాభినందనలు తెలిపి వెళ్తుంది. గోపి, కృష్ణవేణి ఒకటి కావడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి, శోభన, జయచిత్ర, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, కె.కె.శర్మ, చిడతల అప్పారావు, సత్యవతి, అనిత, చిలక రాధ, కల్పనారాయ్, వై.విజయ తదితరులు నటించారు. ఈ చిత్రానికి గణేశ్ పాత్రో మాటలు, సి.నారాయణ రెడ్డి పాటలు రాశారు. కేవీ మహదేవన్ స్వరకల్పన చేశారు. ఇందులోని “మువ్వగోపాలుడొచ్చాడురో…”, “అందగాడా…”, “ముత్యాల చెమ్మచెక్క…”, “వేగుచుక్కా…వెలగపండా…”, “ఏ గుమ్మా…”, “ఎదలోన రగిలే ఈ మూగబాధ…” అంటూ మొదలయ్యే పాటలు అలరించాయి.
తమిళంలో ప్రభు, పల్లవి జంటగా జి.ఎమ్.కుమార్ తెరకెక్కించిన ‘అరువదై నాల్’ ఆధారంగా ‘మువ్వగోపాలుడు’ తెరకెక్కింది. తెలుగు సినిమా ద్వారా జి.ఎమ్.కుమార్ ఉత్తమ కథారచయితగా నందిని అందుకోవడం విశేషం! ఈ సినిమా పదికి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. కొన్ని కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. హైదరాబాద్ లో 300 రోజులకు పైగా ప్రదర్శితమయింది.