జూన్ 24న దాదాపు పది సినిమాలు విడుదల కాబోతున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘చోర్ బజార్’ మూవీని కూడా అదే రోజు విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఈరోజు ప్రకటించారు. అయితే ఇప్పటికే జూన్ 24న పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ నటించిన ‘ఒక పథకం ప్రకారం’ మూవీ విడుదల కావాల్సి ఉంది. మొన్నటి వరకూ ఆ సినిమా పబ్లిసిటీని కూడా బాగా చేశారు. తాజా సమాచారం ప్రకారం ‘ఒక పథకం ప్రకారం’ మూవీ వచ్చే నెల మొదటి వారానికి వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే…. జూన్ 24న రాబోతున్న సినిమాల ద్వారా ముగ్గురు నిర్మాతల కొడుకులు తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.
పైన పేర్కొన్నట్టు దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ ‘చోర్ బజార్’తో పాటు ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు రూపొందించిన ‘7 డేస్ 6 నైట్స్’ మూవీ 24వ తేదీనే వస్తోంది. ఇందులో ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. అలానే ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కొడుకు లక్ష్ నటించిన ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ మూవీ కూడా ఈ శుక్రవారమే రిలీజ్ కాబోతోంది. ఈ ముగ్గురు నిర్మాతల కొడుకులు గత కొంతకాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి వీరిలో ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందో చూడాలి.