బాలీవుడ్ స్టార్ అలియాభట్ నాయికగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయ్ కఠియావాడి’ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ రోజు ముంబై హైకోర్టులో ఈ సినిమాపై వేసిన మూడు కేసులు విచారణకు వచ్చాయి. అందులో రెండు కేసులను కోర్టు కొట్టివేయగా, మరో కేసు విచారణకు కోర్టు తిరస్కరించింది. మూవీ ట్రైలర్ లో చైనా పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసులు వేశారు. అయితే… సినిమా తరఫున న్యాయవాది తన వాదనను గట్టిగా వినిపించారు. ఈ సినిమా కథాకాలమైన 1950లో చైనాకు చెందిన డాక్టర్లు కామాటీపూరా లో ఎక్కువగా ఉండేవారని, వారిని ఉద్దేశించి ‘చైనా’ అనే పదం ఉపయోగించారు కానీ ఈశాన్య రాష్ట్రాల ప్రజలను దృష్టిలో పెట్టుకునో, వారిని కించపరచాలనో కాదని స్పష్టం చేశారు. ఆ పాత్ర చేసిన వ్యక్తిని చైనా వాడిగా చూడాలి తప్పితే, ఈశాన్య రాష్ట్రాల వారిగా కాదని స్పష్టం చేశారు. ఆ కారణాన్ని అడ్డం పెట్టుకుని సినిమా విడుదలను ఆపాలని చూడటం దారుణమని అన్నారు.
తన వాదనను బలపరిచే సన్నివేశాలను కోర్టుకు ఏకరువు పెట్టారు. ఆ వాదనతో ఏకీభవించిన కోర్టు రెండు కేసులనూ కొట్టేసింది. సహజంగానే సంజయ్ లీలా భన్సాలీ సినిమా అంటే కోర్టు కేసులు, గొడవలు లేకుండా విడుదల కాదనే పరిస్థితి వచ్చేసింది. ఆయన గత చిత్రం ‘పద్మావత్’ విషయంలోనూ అదే జరిగింది. అయితే ఇప్పుడు సినిమా విడుదలకు రెండు రోజుల ముందే కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు పలు భాషల్లో ‘గంగూబాయ్’ సినిమా ఈ నెల 25వ తేదీ విడుదలకు మార్గం సుగమం అయ్యింది.
