ఫిబ్రవరి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ తో సినీ ప్రముఖులు జరిపిన సమావేశం ఫలప్రదమైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోగానే సినిమా రంగానికి సంబంధించిన సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా టిక్కెట్ రేట్ల పైన కూడా ఈ నెల మూడో వారంలోనే ఓ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ల క్రమబద్ధీకరణ నిమిత్తం వేసిన కమిటీ ఇప్పటికే మూడుసార్లు సమావేశం అయ్యింది.
Read Also : Spider Man : మేడమ్ టుస్సాడ్స్‌లో హీరోయిన్ స్టాచ్యూ… ఫ్యాన్స్ ఫైర్
ఈ నెల 2వ తేదీ జరిగిన సమావేశంలో టిక్కెట్ రేట్లపై కమిటీ ఓ ముసాయిదాను తయారు చేసిందని అంటున్నారు. దానిని ముందు పెట్టుకునే జగన్, సినీ ప్రముఖులతో చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం సినీ ప్రముఖులు చెప్పిన సలహాలూ, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్న వై. యస్. జగన్ టిక్కెట్ రేట్ల కమిటీ ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ కు బ్రీఫింగ్ చేశారని అంటున్నారు. దాంతో టిక్కెట్ రేట్ల కోసం వేసిన కమిటీ ఈ నెల 17న తుది సమావేశం కాబోతోందని తెలిసింది. ఆ సమావేశంలో టిక్కెట్ రేట్ల గురించి పరిశ్రమ పెద్దలు వెలుబుచ్చిన అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని తుది నివేదికను తయారు చేసే ఆస్కారం ఉంది.